తెలంగాణవీణ జాతీయం : కోల్‌కతాలోని ఆర్జీకార్ మెడికల్ కళాశాలలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన (Kolkata Doctor Rape Murder Case) దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఘటనపై వైద్యుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. మరోవైపు దీనిపై సీబీఐ విచారణకు కలకత్తా హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో ఆసుపత్రి నిర్లక్ష్య వైఖరి, యాజమాన్యం ప్రమేయం ఏదైనా ఉందా..? అనే అంశాలపై కూడా దర్యాప్తు సంస్థ విచారణ చేపట్టనుంది.ఈ కేసు విచారణలో ప్రధానంగా సీబీఐ ఆరు అంశాలపై దృష్టిపెట్టనున్నట్లు సమాచారం. వైద్యురాలిపై ఒక్కరే అఘాయిత్యానికి పాల్పడ్డారా.. లేదా ఎక్కువమంది ఉన్నారా..? ఈ ఘటనలో అరెస్టు చేసిన నిందితుడు సంజయ్‌రాయ్ వెనక ఎవరైనా ఉన్నారా..? ఘటన తర్వాత సాక్ష్యాలను నాశనం చేశారా..? ఈ ఘటనను మొదట ఎందుకు ఆత్మహత్యగా చిత్రీకరించారు..? ఈ ఘటనలో ఆస్పత్రి యాజమాన్యం ప్రమేయం ఏమైనా ఉందా..? రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంటే.. ఉదయం వరకు పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు..? ఇలా పలు అంశాలపై సీబీఐ బృందం దర్యాప్తు చేపట్టనున్నట్లు తెలుస్తోంది.ఈ కేసులో దర్యాప్తు చేపడుతున్న స్పెషల్ క్రైమ్ యూనిట్.. ఘటనా స్థలంలో ఫింగర్ ప్రింట్స్, కాలిముద్రలు, ఇతర ఫోరెన్సిక్ ఎవిడెన్స్‌లను పరిశీలించనుంది. నిందితుడుఅక్కడే ఉన్నాడా అని తేల్చనుంది. మరోవైపు ఘటన జరిగిన సమయంలో అక్కడ ఎవరెవరు ఉన్నారనేది తెలుసుకునేందుకు మొబైల్ ఫోన్‌లో డేటాను పరిశీలించనుంది. ఆసుపత్రి వైద్యుల నుంచి స్టేట్‌మెంట్ తీసుకోనుంది. హత్యకు ముందు జూనియర్వైద్యురాలితోకలిసిభోజనం చేసిన ఆమె నలుగురు స్నేహితులను కూడా విచారించనుంది.ప్రతిపక్ష భాజపా నుంచి తీవ్ర ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో ఈ కేసు విచారణపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇటీవల ఓ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. విచారణను స్థానిక పోలీసులు ఆదివారం వరకూ తేల్చకపోతే.. సీబీఐకి అప్పగిస్తామని వెల్లడించారు. అయితే.. ఈ విషయంలో హైకోర్టు కలగజేసుకొని.. సాక్ష్యాలు తారుమారయ్యే ప్రమాదం ఉన్నందున.. మరింత సమయం వృథా కాకూడదని, వెంటనే కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించిన అన్ని దస్త్రాలను బుధవారం ఉదయం 10 గంటల్లోపు సీబీఐకి అందజేయాలని పోలీసులకు సూచించింది. జూనియర్ వైద్యురాలిపై అత్యంత పాశవిక దాడి జరుగుతుంటే ఆసుపత్రిలో ఉన్నవారికి ఆ విషయం తెలియకపోవడం, యాజమాన్యం ఆలస్యంగా స్పందించడంపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తంచేసింది.మంగళవారం నాటి విచారణలో హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై తీవ్ర అసహనం వ్యక్తంచేసింది. ఈ ఘటన అనంతరం వైద్యుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో నైతిక కారణాలతో రాజీనామా చేసిన ఆర్జీకార్ ఆసుపత్రి ప్రిన్సిపల్‌కు.. గంటల వ్యవధిలోనే కొత్త బాధ్యతలు అప్పగించడాన్ని కోర్టు ప్రశ్నించింది. ఆయన్ను వెంటనే విధుల నుంచి తొలగించి, సెలవుపై పంపాల్సిందిగా ఆదేశించింది.