తెలంగాణవీణ జాతీయం :కాంగ్రెస్ ఎంపీ, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన జీవితాంతమూ ప్రతిపక్షంలోనే ఉంటారని ఎద్దేవా చేశారు. రాహుల్ ప్రమాదకరమైన వ్యక్తి అని, దేశాన్ని, దేశ ఆర్థిక వ్యవస్థను అస్థిర పరిచేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ప్రధాని కావాలన్న కోరిక నెరవేరే మార్గం కనిపించక రాహుల్ గాంధీ దేశాన్ని నాశనం చేయడమే ఎజెండాగా పెట్టుకున్నాడని విమర్శించారు. ఆయన విషపూరితమైన వ్యక్తి అని, విధ్వంసకారుడని ఆరోపించారు. భారత దేశ స్టాక్ మార్కెట్ టార్గెట్ గా హిండెన్ బర్గ్ విడుదల చేసిన రిపోర్టును రాహుల్ గాంధీ సమర్థించడం హేయమని చెప్పారు.దేశ భద్రత, ఆర్థిక వ్యవస్థ.. అన్నింటినీ అస్థిరపరిచేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని కంగనా చెప్పారు. భారతీయుల దేశభక్తి, జాతీయవాదం కారణంగా రాహుల్ గాంధీ ఇబ్బంది పడుతుంటారని అన్నారు. ప్రజల్లో దేశ భక్తి మరింత పెరుగుతోందని, ఇది రాహుల్ గాంధీకి మరిన్ని కష్టాలను తెచ్చిపెడుతుందని వివరించారు. రాహుల్ ను ప్రజలు ఎప్పటికీ నాయకుడిగా ఎన్నుకోబోరని చెప్పారు. జీవిత పర్యంతం ప్రతిపక్షంలోనే కూర్చునేందుకు సిద్ధమవ్వాలంటూ రాహుల్ గాంధీకి కంగనా సూచించారు.