తెలంగాణవీణ జాతీయం : ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఆలోచించే మెషీన్ బుజ్జికి కీర్తిసురేశ్ వాయిస్ ఓవర్ అందించిన విషయం తెలిసిందే. ఆ పాత్రకు వాయిస్ ఓవర్ అందించడంపై కీర్తిసురేశ్ తాజాగా ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ‘కల్కి’కి సంబంధించి నాగ్ అశ్విన్ మొదట తనకు ఒక రోల్ ఆఫర్ చేశారని చెప్పారు. కానీ తాను దానిని తిరస్కరించానని తెలిపారు.‘‘కల్కి 2898 ఏడీ’ అనుకున్నప్పుడు ఒక పాత్ర కోసం దర్శకుడు నన్ను సంప్రదించారు. అది నేను చేయలేనని చెప్పా. ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడం నాకు ఇష్టమేనని మెసేజ్ చేశా. ఆ సమయంలో ఆయన కాల్ చేసి ‘బుజ్జి’ రోల్‌కు వాయిస్ ఓవర్ ఇవ్వాలని అడిగారు. నాకు మొదట అర్థంకాలేదు. షూట్‌లో నేను భాగం కావాల్సిన అవసరం లేదా? అని అడిగా. లేదు కేవలం వాయిస్ ఓవర్ ఇస్తే చాలన్నారు. నాకు ఆశ్చర్యంగా అనిపించింది. వెంటనే ఎస్ చెప్పా. వాయిస్ ఓవర్ విషయంలో నాగ్ అశ్విన్ నాకెంతో సాయం చేశారు’’ అని కీర్తిసురేశ్ తెలిపారు. సినిమాలో రోల్ చేయనందుకు తాను బాధపడటం లేదని.. ‘బుజ్జి’కి వాయిస్ ఓవర్ ఇచ్చినందుకు సంతోషంగా ఉన్నానని అన్నారు. ‘కల్కి పార్ట్ 2’ కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పారు. నాగ్ అశ్విన్ తనకు ఆఫర్ చేసిన పాత్ర ఏమిటనేది మాత్రం తాను చెప్పనన్నారు.లైమ్‌లైట్‌లో ఉండటం తనకు ఇష్టమని, చిన్నతనం నుంచే తనకు ఓ ఆశ ఉందని చెప్పారు. ‘‘మా అమ్మ నటి కావడంతో మేము ఎప్పుడైనా బయటకు వెళ్లినప్పుడు అభిమానులు ఆమెను చుట్టుముట్టేవారు. ఆమె నుంచి ఆటోగ్రాఫ్స్ తీసుకునేవారు. అది నాకెంతో నచ్చేది. నేను కూడా ఏదోఒకరోజు ఆ స్థాయికి వెళ్లాలని భావించేదాన్ని. ఆటోగ్రాఫ్ ప్రాక్టీస్ చేశా. చదువు పూర్తయ్యాక.. సినిమాల్లోకి రావాలి లేదా స్టైలిష్ట్‌గా అయినా మారాలనుకున్నా. నాకెంతో ఇష్టమైన సినీ రంగంలోకి వచ్చి ఇంతమంది అభిమానం పొందుతున్నందుకు ఆనందిస్తున్నా’’ అని చెప్పారు. కీర్తి సురేశ్ నటించిన తాజా చిత్రం ‘రఘు తాత’. సుమన్‌కుమార్ తెరకెక్కించిన వినోదాత్మక చిత్రమిది. ఈ సినిమాని హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మించారు. హిందీ రాని ఓ తమిళ అమ్మాయి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొందనే నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కినట్లు ప్రచార చిత్రాలు చూస్తే అర్థమవుతుంది. ఆగస్టు 15న ఇది విడుదల కానుంది. ‘ఉప్పుకప్పు రంబు’, ‘రివాల్వర్ రీటా’, ‘బేబీ జాన్’ వంటి ప్రాజెక్టులు ఆమె చేతిలో ఉన్నాయి.