తెలంగాణవీణ జాతీయం : బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి.. దేశం వదిలి వెళ్లిపోవడం వెనుక అమెరికా హస్తం ఉందనే అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈమేరకు ఆమె కొన్ని నెలల క్రితం నర్మగర్భంగా సంకేతాలిచ్చారనే ప్రచారం జరుగుతోంది. ఆమె ప్రభుత్వానికి అమెరికాతో సత్సంబంధాలు లేకపోవడాన్ని దీనికి ప్రధాన కారణమనే భావిస్తున్నారు. ఫలితంగా అగ్రరాజ్యం ఆగ్రహానికి గురై.. తీవ్ర నిరసనల మధ్య ఆమె కట్టుబట్టలతో దేశాన్ని వీడాల్సిన పరిస్థితి నెలకొందని వెల్లడించారు. మొదటి నుంచి అమెరికా అసంతృప్తి..ఈ ఏడాది జనవరిలో బంగ్లాదేశ్ ఎన్నికలు జరిగాయి. దీనిని ప్రధాన ప్రతిపక్షమైన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) బహిష్కరించింది. ఆ తర్వాత ఈ ఎన్నికలను సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించింది. పోలింగ్ ఇతర అంశాలను పరిశీలించేందుకు అమెరికా, కెనడా, రష్యా, ఓఐసీ, అరబ్ పార్లమెంట్ పరిశీలకులు వచ్చారు. ఎన్నికలు సాఫీగానే జరిగినట్లు వారు పేర్కొన్నారు. కాగా, అమెరికా విదేశాంగశాఖ మాత్రం ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా సాగలేదని ఆరోపించింది. ఇది నాలుగోసారి ఎన్నికైన హసీనా ప్రభుత్వానికి ఇబ్బందికరంగా పరిణమించింది. నాడు హసీనా సంచలన ప్రకటన..కొన్ని నెలలు మౌనంగా ఉన్న హసీనా మే నెలలో ఓ సంచలన ప్రకటన చేశారు. బంగ్లాదేశ్‌లో వైమానిక స్థావరం ఏర్పాటుచేసుకోవడానికి ఒక దేశానికి అనుమతిస్తే.. తన ఎన్నిక సాఫీగా జరిగేటట్లు చేస్తానని ఆఫరిచ్చిందన్నది దాని సారాంశం. ఈ ప్రకటన ఒక్కసారిగా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. అమెరికానే ఆ దేశం అయి ఉంటుందనే ప్రచారం జరిగింది. ‘‘ఒక దేశానికి బంగ్లాదేశ్‌లో వైమానిక స్థావరం ఏర్పాటు చేసేందుకు అనుమతిస్తే నాకు ఏ సమస్యా ఉండేది కాదు. ఇది చూడటానికి ఒక దేశాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకొన్నట్లు కనిపిస్తుంది. కానీ, వారి లక్ష్యం అదికాదు.. అది ఎక్కడికి వెళుతుందో నాకు తెలుసు. మరిన్ని సమస్యలు ఎదురుకావచ్చు. ఆందోళన చెందకండి. నేను జాతిపిత బంగబంధు షేక్ ముజిబుర్ రెహ్మాన్ కుమార్తెనని వారికి చాలా స్పష్టంగా చెప్పాను. మా స్వాతంత్ర్య పోరాటాన్ని మేము గెలిచామని స్పష్టంగా చెప్పాను. నా దేశాన్ని ఎవరికో అద్దెకు ఇచ్చో.. అప్పగించో అధికారంలోకి రావాలని నేను కోరుకోవడం లేదన్నాను. ఈస్ట్‌తైమూర్ వలే వారు ఇక్కడ కూడా బంగ్లాదేశ్‌లోని చోటోగ్రామ్, మయన్మార్‌లోని కొంత భాగాన్ని విడగొట్టి కొత్త దేశం ఏర్పాటుచేస్తారు. బంగాళాఖాతంలో ఒక స్థావరాన్ని ఏర్పాటుచేసుకొంటారు’’ అని నాడు హసీనా పేర్కొన్నారు. నాటి నుంచి హసీనా ప్రభుత్వం ఎక్కువ రోజులు అధికారంలో ఉండదనే ప్రచారం మొదలైంది. ఆమె కూడా షేక్ ముజిబుర్ రెహ్మాన్ వంటి పరిస్థితిని ఎదుర్కొంటుందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అగ్రరాజ్యంతో పేచీలే..బంగ్లాదేశ్ ఎగుమతులను అత్యధికంగా అమెరికానే కొనుగోలు చేస్తుంది. అదే సమయంలో ఆ దేశంలో స్వేచ్ఛ, పారదర్శకంగా ఎన్నికలు జరగాలని తరచూ డిమాండ్ చేస్తుంది. ఈ క్రమంలో అధికార పక్షానికి చెందిన పలువురు నాయకులు, లాఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులపై గత సెప్టెంబర్‌లో అమెరికా వీసా ఆంక్షలను విధించింది. వాషింగ్టన్‌లోని విల్సన్ సెంటర్ సౌత్ ఏషియా ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ మిషెల్ కుగుల్మెన్ ఈ ఏడాది జనవరిలో బ్లూమ్ బెర్గ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘పారదర్శక ఎన్నికల కోసం బంగ్లాదేశ్‌పై అమెరికా చాలా ఒత్తిడి చేసింది. నయానో, భయానో చెప్పి చూసింది. ఎలాంటి ప్రయోజనం లేదు. ఫలితంగా ఇప్పుడు ఎన్నికల తర్వాత కఠిన చర్యలతో స్పందించే అవకాశం ఉంది. ఇవి బంగ్లాదేశ్‌ను బాగా ఇబ్బందిపెడతాయి’’ అని పేర్కొన్నారు. రెండు నెలల క్రితం బంగ్లా మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ అజిజ్ అహ్మద్‌పై అమెరికా ఆంక్షలు విధించింది. దేశంలో ప్రజాస్వామ్యం అణచివేతలో అతడి పాత్ర ఉందని ఆరోపించింది. మరోవైపు గతేడాది తమ ఎన్నికల్లో జోక్యం చేసుకొంటున్నారంటూ అమెరికా దౌత్యవేత్త పీటర్‌హాస్‌ను బంగ్లా అధికార పక్షం అవామీ లీగ్ నేతలు ఆరోపించారు. అప్పట్లో రష్యా కూడా అమెరికా తీరును తప్పుపట్టింది. బంగ్లా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకొంటోందని ఆరోపించింది. కానీ, వీటిని ఉద్దేశపూర్వకంగానే ఆరోపణలు చేస్తోందని నాడు అమెరికా తోసిపుచ్చింది. ఆ తర్వాత కొన్ని నెలల్లోనే అనూహ్యంగా ఓ న్యాయస్థానం కారణంగా రిజర్వేషన్ల అంశం తెరపైకి వచ్చింది. ఇది చినికి చినికి గాలివానగా మారింది. దీంతో బంగ్లా ప్రధాని అనూహ్యంగా దేశం వదిలి వెళ్లిపోవడంతో పాత అంశాలు మొత్తం తెరపైకి వచ్చి చర్చనీయాంశంగా మారాయి.