తెలంగాణవీణ జాతీయం : శ్రీలంకతో చివరి టీ20లో ఓటమి ఖాయమనుకున్న దశలో మ్యాచ్‌ను టైగా ముగించి, సూపర్ ఓవర్లో గెలిచేసిన భారత జట్టు.. అదే జట్టుతో వన్డే మ్యాచ్‌లో గెలవాల్సిన మ్యాచ్‌ను టైగా ముగించింది. రెండు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి వన్డేలో స్కోర్లు సమమయ్యాయి. ఇది వన్డే కావడంతో సూపర్ ఓవర్ లేదు. దీంతో ఫలితం తేలలేదు.
కొలంబో: శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన భారత జట్టు.. వన్డే సిరీస్ తొలి మ్యాచ్‌ను టై చేసుకుంది. శుక్రవారం మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన లంక.. 8 వికెట్లకు 230 పరుగులు చేసింది. వెల్లలాగె (67; 65 బంతుల్లో 7×4, 2×6), నిశాంక (56; 75 బంతుల్లో 9×4) రాణించారు. అక్షర్ పటేల్ (2/33), అర్ష్‌దీప్ సింగ్ (2/47), కుల్‌దీప్ (1/33) ప్రత్యర్థిని కట్టడి చేశారు. అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ (58; 47 బంతుల్లో 7×4, 3×6) అదిరే ఆరంభాన్నిచ్చినా.. జట్టు సద్వినియోగం చేసుకోలేకపోయింది. స్పిన్నర్లు హసరంగ (3/58), అసలంక (3/30), వెల్లలాగె (2/39) విజృంభించడంతో భారత్ 47.5 ఓవర్లలో సరిగ్గా 230 పరుగులకు ఆలౌటైంది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన వెల్లలాగె ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. రెండో వన్డే ఆదివారం జరుగుతుంది. విజయానికి చేరువై..: బలమైన బ్యాటింగ్ ఆర్డర్ ఉన్న భారత్‌కు 231 పరుగుల లక్ష్యం ఏపాటిది అనుకుంటే.. ఛేదనలో బలమైన పునాది పడ్డాక కూడా గెలవలేకపోయింది. రోహిత్ తనదైన శైలిలో చెలరేగుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అతడి ధాటికి లంక పేసర్లు తాళలేక పోయారు. స్పిన్నర్లు వచ్చాక రోహిత్ నెమ్మదించినా ఇన్నింగ్స్ సాఫీగానే సాగిపోయింది. మరో ఎండ్‌లో శుభ్‌మన్ (16) సహాయ పాత్ర పోషించాడు. అయితే వెల్లలాగే వరుస ఓవర్లలో శుభ్‌మన్, రోహిత్‌లను ఔట్ చేసి భారత్‌ను దెబ్బ కొట్టాడు. బ్యాటింగ్ ఆర్డర్లో ముందు వచ్చిన సుందర్ (5) కూడా ఎక్కువసేపు నిలవకపోవడంతో భారత్ 75/0 నుంచి 87/3కు చేరుకుంది. ఈ దశలో కోహ్లి (24), శ్రేయస్ (23) ఇన్నింగ్స్‌ను కుదుటపరిచే ప్రయత్నం చేశారు. కానీ వీళ్లిద్దరూ స్వల్ప వ్యవధిలో వెనుదిరిగారు. ఆ తర్వాత రాహుల్ (31), అక్షర్ (33) నిలకడగా ఆడడంతో 189/5తో భారత్ విజయానికి చేరువైంది. ఇక తేలిగ్గానే గెలిచేస్తుందనుకుంటే.. క్రీజులో బాగా కుదురుకున్న బ్యాటర్లు ఔటైపోయారు. ఈ దశలో దూబె (25) పోరాడి జట్టును విజయానికి చేరువ చేశాడు. 2 వికెట్లు చేతిలో ఉండగా.. 47.3 ఓవర్లకు స్కోరు సమమైంది. దూబె క్రీజులో ఉండడంతో విజయం లాంఛనమే అనిపించింది. కానీ అసలంక.. వరుస బంతుల్లో దూబె, అర్ష్‌దీప్‌లను వికెట్ల ముందు దొరకబుచ్చుకుని జట్టుకు ఓటమి తప్పించాడు. మొదట నిశాంక లంకకు మంచి ఆరంభాన్నిచ్చినా.. భారత బౌలర్లు సమష్టిగా సత్తా చాటడంతో 101/5తో కష్టాల్లో పడింది. ఈ స్థితిలో వెల్లలాగె అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టుకు గౌరవప్రదమైన స్కోరునందించాడు. అతను లియనాగె (20), హసరంగ (24), అఖిల (17)లతో భాగస్వామ్యాలు నెలకొల్పాడు.
శ్రీలంక ఇన్నింగ్స్: నిశాంక ఎల్బీ (బి) సుందర్ 56; ఆవిష్క (సి) అర్ష్‌దీప్ (బి) సిరాజ్ 1; కుశాల్ మెండిస్ ఎల్బీ (బి) దూబె 14; సమరవిక్రమ (సి) శుభ్‌మన్ కుల్‌దీప్ 14; లియనాగె (సి) రోహిత్ (బి) అక్షర్ 20; వెల్లలాగె నాటౌట్ 67; హసరంగ (సి) అక్షర్ (బి) అర్ష్‌దీప్ 24; అఖిల (సి) సుందర్ (బి) అర్ష్‌దీప్ 17; షిరాజ్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 8 మొత్తం: (50 ఓవర్లలో 8 వికెట్లకు) 230; వికెట్ల పతనం: 1-7, 2-46, 3-60, 4-91, 5-101, 6-142, 7-178, 8-224; బౌలింగ్: సిరాజ్ 8-2-36-1; అర్ష్‌దీప్ 8-0-47-2; అక్షర్ పటేల్ 10-0-33-2; శివమ్ దూబె 4-0-19-1; కుల్‌దీప్ 10-0-33-1; సుందర్ 9-1-46-1; శుభ్‌మన్ 1-0-14-0
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ ఎల్బీ (బి) వెల్లలాగె 58; శుభ్‌మన్ (సి) కుశాల్ మెండిస్ (బి) వెల్లలాగె 16; కోహ్లి ఎల్బీ (బి) హసరంగ 24; సుందర్ ఎల్బీ (బి) అఖిల 5; శ్రేయస్ (బి) అసిత 23; కేఎల్ రాహుల్ (సి) వెల్లలాగె (బి) హసరంగ 31; అక్షర్ పటేల్ (సి) కుశాల్ మెండిస్ (బి) అసలంక 33; దూబె ఎల్బీ (బి) అసలంక 25; కుల్‌దీప్ (బి) హసరంగ 2; సిరాజ్ నాటౌట్ 5; అర్ష్‌దీప్ ఎల్బీ (బి) అసలంక 0; ఎక్స్‌ట్రాలు 8 మొత్తం: (47.5 ఓవర్లలో ఆలౌట్) 230; వికెట్ల పతనం: 1-75, 2-80, 3-87, 4-130, 5-132, 6-189, 7-197, 8-211, 9-230; బౌలింగ్: అసిత ఫెర్నాండో 6-1-34-1; షిరాజ్ 4-0-25-0; వెల్లలాగె 9-1-39-2; అఖిల ధనంజయ 10-0-40-1; హసరంగ 10-0-58-3; అసలంక 8.5-0-30-3