తెలంగాణవీణ జాతీయం : పశ్చిమ్ బెంగాల్‌లోని శిలిగుడి సఫారీ పార్కులో అక్బర్, సీత పేర్లు కలిగిన మగ, ఆడ సింహాలను ఒకే ఎన్‌క్లోజర్‌లో ఉంచడం త్రీవ వివాదానికి దారితీసిన విషయం విదితమే. తాజాగా వాటి పేర్లు సూరజ్, తాన్యాగా మారుస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం సింహాల పేర్లు మార్చడంతో ఈ కేసు వివాదం ఇంతటితో ముగిసినట్లు అదనపు అడ్వకేట్ జ్యోతి చౌదరి పేర్కొన్నారు. త్రిపుర నుంచి బెంగాల్‌కు అప్పగించే సమయంలో సింహాలు ఈ పేర్లు కలిగిఉన్నాయని రుజువయ్యిందన్నారు. సింహాల పేర్లు మారడంతో విశ్వహిందూపరిషత్ (వీహెచ్‌పీ) హర్షం వ్యక్తం చేసింది. జంతువుల మార్పిడి కార్యక్రమంలో భాగంగా బెంగాల్ అధికారులు ఫిబ్రవరి 12న త్రిపురలోని సిపాహీజలా జులాజికల్ పార్కు నుంచి రెండు సింహాలను శిలిగుడి సఫారీ పార్కుకి తీసుకొచ్చారు. అక్బర్, సీత పేర్లు కలిగిన ఆ మగ, ఆడ సింహాలను ఒకే ఎన్‌క్లోజర్‌లో ఉంచారు. దీనిపై విశ్వహిందూపరిషత్ కలకత్తా హైకోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర అటవీశాఖ అధికారులే వాటికి ఆ పేర్లు పెట్టారని.. అవి హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని ఆరోపించింది. వెంటనే వాటి పేర్లను మార్చాలని డిమాండ్ చేసింది. ఈ వ్యవహారంపై కోర్టు సైతం ఆగ్రహం వ్యక్తంచేసింది. వాటి పేర్లు మార్చాలని బెంగాల్ ప్రభుత్వానికి మౌఖికంగా సూచించింది. ఈనేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పేర్లు మార్చడంతో ఈ వివాదానికి తెరపడింది.