తెలంగాణవీణ జాతీయం : దేశంలో జరిగే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల కనీస వయసును 21 ఏళ్లకు తగ్గించాలని ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా డిమాండ్ చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా రాజ్యసభలో మాట్లాడుతూ ఈ అంశం లేవనెత్తారు. ఎన్నికల బరిలో నిలిచేందుకు అభ్యర్థుల కనీస వయసు ప్రస్తుతం 25 ఏళ్లుగా ఉంది.‘‘మనది యువ భారతం. మనవద్ద 35 ఏళ్ల కంటే తక్కువ వయసున్న జనాభా 65 శాతంగా ఉంది. 25 ఏళ్ల లోపువారు 50 శాతం మంది ఉన్నారు. స్వాతంత్య్రం తర్వాత ఎన్నికైన లోక్‌సభలో 40 ఏళ్లలోపు వారు 26 శాతం మంది ఉన్నారు. ప్రస్తుత లోక్‌సభలో అది 12 శాతం మాత్రమే. వయసు మళ్లిన నాయకులతో ఉన్న యువ దేశం మనది. యువ నాయకులతో ఉన్న దేశంగా మారాలి. అందుకోసం నా తరఫు నుంచి కేంద్ర ప్రభుత్వానికి ఒక సూచన చేస్తున్నాను. ఎన్నికల్లో పోటీ చేసేందుకు కనీస వయసు 25 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు తగ్గించాలి’’ అని సూచించారు.