తెలంగాణవీణ సినిమా : గద్దర్ అవార్డులపై తెలంగాణ రాష్ట్ర ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎఫ్‌డీసీ)తో చర్చించామని తెలుగు ఫిల్మ్ ఛాంబర్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తెలిపాయి. గద్దర్ అవార్డుల కోసం కమిటీ ఏర్పాటు చేయాలని ఎఫ్‌డీసీని కోరామని పేర్కొన్నాయి. కమిటీ ద్వారా విధి విధానాలను రూపొందించి ఎఫ్‌డీసీ ద్వారా ప్రభుత్వానికి అందజేస్తామని వెల్లడించాయి.‘గద్దర్’ పేరిట అవార్డులు ఇస్తామని ప్రకటించినా చిత్ర పరిశ్రమ తమని సంప్రదించలేదని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించిన నేపథ్యంలో అగ్ర కథానాయకుడు చిరంజీవి ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ప్రతిపాదనను ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమ తరపున ఫిలిం ఛాంబర్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఈ విషయమై దృష్టి సారించాలని ఎక్స్ వేదికగా కోరారు.చిరు సూచనతో రంగంలోకి దిగిన తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు చలన చిత్ర నిర్మాత మండలి వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేశాయి. తెలుగు చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం సీఎం రేవంత్‌రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేస్తున్న కృషికి ధన్యవాదాలు తెలిపాయి. ప్రజా గాయకుడు ‘గద్దర్’ పేరిట అవార్డులు ఇస్తున్నందుకు ఎంతో గర్వంగా ఉందని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తెలిపింది.