తెలంగాణవీణ జాతీయం : కొండచరియలు విరిగిపడే అవకాశాలు ఉన్నాయన్న విషయంపై కేరళను ముందే హెచ్చరించామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా పేర్కొన్నారు. ఈ ముప్పు గురించి జులై 23నే అప్రమత్తం చేశామన్నారు. కానీ, రాష్ర్ట ప్రభుత్వం మాత్రం పౌరులను సకాలంలో తరలించలేదని చెప్పారు. భారీ వర్షాలు కురవగానే తొమ్మిది ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను ఆ రాష్ట్రానికి పంపించామన్నారు. రాష్ట్రంలో చోటుచేసుకున్న తాజా పరిణామాలపై కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్యసభలో ఓ ప్రకటన చేశారు.‘‘ప్రకృతి వైపరీత్యాల గురించి ఏడు రోజుల ముందే హెచ్చరికలు చేసే వ్యవస్థ భారత్‌లో ఉంది. ప్రపంచంలో ఇటువంటి సాంకేతికత ఉన్న నాలుగు దేశాల్లో మనది ఒకటి. ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు అక్కడికి చేరుకున్న వెంటనే అప్రమత్తమై ఉంటే ప్రాణ నష్టం తగ్గి ఉండేది. వయనాడ్ విషాదాన్ని ఎదుర్కొనేందుకు కేరళ ప్రభుత్వంతోపాటు అక్కడి ప్రజలకు నరేంద్ర మోదీ ప్రభుత్వం బాసటగా నిలుస్తుంది’’ అని అమిత్ షా పేర్కొన్నారు.