తెలంగాణవీణ సినిమా : అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ సినీ ప్రయాణం ప్రారంభించి ఆగస్టు 30వ తేదీతో 50ఏళ్లు పూర్తి చేసుకోనుంది. ఆయన తొలి చిత్రం ‘తాతమ్మ కల’ 1974 ఆగస్టు 30న విడుదలైంది. విజయవంతమైన కథానాయకుడిగా ప్రయాణం కొనసాగిస్తున్న బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా రాజకీయ రంగంపైనా, బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి ఛైర్మన్‌గా సేవా రంగంపైనా తనదైన ముద్ర వేశారు. ఈ సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమ ఆయన్ను సెప్టెంబరు 1న ఘనంగా సన్మానించాలని నిర్ణయించింది.తెలుగు చలన చిత్ర వాణిజ్యమండలి కార్యదర్శి కె.ఎల్.దామోదర్ ప్రసాద్, తెలంగాణ చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు సునీల్ నారంగ్, తెలుగు సినీ నిర్మాతల మండలి కార్యదర్శి టి.ప్రసన్నకుమార్, తెలుగు సినీ కార్మిక సమాఖ్య అధ్యక్షుడు వల్లభనేని అనిల్ ఇటీవల హైదరాబాద్‌లో బాలకృష్ణని కలిసి, సన్మాన వేడుక ఏర్పాటుకు అంగీకారం తెలపాల్సిందిగా కోరారు. అందుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.సన్మాన వేడుకకు భారతీయ సినిమా, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఆహ్వాన పత్రికను కూడా తీసుకొచ్చారు. సినీ రంగానికి చేసిన సేవలను ప్రస్తావిస్తూ దాన్ని విడుదల చేశారు. సెప్టెంబరు 1వ తేదీ సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లో ఈ వేడుక ప్రారంభంకానుంది. 50ఏళ్ల సినీ ప్రయాణంలో బాలకృష్ణ 109 సినిమాల్లో కథానాయకుడిగా నటించారు. ఆయన సరసన 129 మంది హీరోయిన్స్ ఆడిపాడారు. భారతీయ నటుల్లో అత్యధిక మంది హీరోయిన్స్‌తో కలిసి నటించిన వ్యక్తిగా ఆయనకు రికార్డు ఉంది. సోషల్, మైథలాజికల్, హిస్టారికల్, బయోపిక్, సైన్స్ ఫిక్షన్ ఇలా అన్ని జానర్స్‌లో నటించిన రికార్డు బాలయ్యకు ఉంది.ప్రస్తుతం బాలకృష్ణ కథానాయకుడిగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మాతలు. బాలీవుడ్ నటుడు బాబీ దేవోల్ ప్రతినాయకుడి పాత్రని పోషిస్తున్నారు. ఇది బాలకృష్ణ 109వ చిత్రం. యాక్షన్ ప్రధానంగా రూపొందుతున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్, ఛాయాగ్రహణం: విజయ్ కార్తీక్.