తెలంగాణవీణ జాతీయం : పారిస్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవ పరేడ్‌లో ఓ పొరపాటు చోటుచేసుకుంది. దాంతో విశ్వక్రీడల నిర్వాహకులు దక్షిణ కొరియాకు క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే..?శుక్రవారం సెన్ నదిపై పారిస్ ఒలింపిక్స్ ఆరంభ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఫ్రెంచ్ అక్షర క్రమంలో ఒక్కో దేశం నదిపై పరేడ్‌లో పాల్గొంది. ఈ క్రమంలోనే బోట్‌లో జెండాను ఊపుతూ దక్షిణ కొరియా క్రీడాకారుల బృందం రాగా.. ఆ దేశాన్ని పరిచయం చేస్తూ డెమోక్రాటిక్ పీపుల్స్ ఆఫ్ కొరియా అని వెల్లడించారు. అది ఉత్తరకొరియా అధికారిక నామం. రిపబ్లిక్ ఆఫ్ కొరియా అంటే దక్షిణ కొరియా. పేరు విషయంలో గందరగోళం ఈ పరిస్థితికి దారితీసింది. తమ పొరపాటును గుర్తించిన నిర్వాహకులు క్షమాపణలు కోరారు. ‘‘ప్రారంభ కార్యక్రమం ప్రసారంలో భాగంగా కొరియన్ బృందాన్ని పరిచయం చేస్తున్నప్పుడు జరిగిన పొరపాటుకు క్షమాపణలు కోరుతున్నాం’’ అని ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఎక్స్ ఖాతాలో కొరియన్ భాషలో పోస్టు పెట్టింది.ఈ ఘటనపై ఐఓసీ ప్రెసిడెంట్ థామస్ బాక్‌తో సమావేశం ఏర్పాటు చేయాలని దక్షిణ కొరియా క్రీడాశాఖ మంత్రి కోరారు. దీనిపై ఫ్రాన్స్ ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా చూసుకోవాలని నిర్వాహకులకు సూచించారు.