తెలంగాణవీణ హైదరాబాద్ : శామీర్‌పేట, న్యూస్‌టుడే: రాజీవ్ రహదారిపై అతివేగంగా కారు నడిపి బస్సును ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు మృతి చెందారు. బయోటెక్ సంస్థకు చెందిన బస్సులోని 10మంది ఉద్యోగులకు స్వల్ప గాయాలయ్యాయి. ఓ ద్విచక్రవాహనదారుడికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన శుక్రవారం జరిగింది. ఇన్‌స్పెక్టర్ యాదయ్యగౌడ్, బాధితులు వివరాలిలా ఉన్నాయి. తూంకుంట పురపాలిక పరిధి హకీంపేటకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి శేఖర్ మోహన్‌వాలే(25), ఈసీఐఎల్ మౌలాలీకి చెందిన కోపార్ట్ ఐటీ ఉద్యోగి మలావత్ దీపిక(23) ఇన్నోవా కారులో గజ్వేల్ నుంచి హైదరాబాద్ వైపు రాజీవ్ రహదారి మీదుగా వస్తున్నారు. తుర్కపల్లి-మజీద్‌పూర్ గ్రామాల మధ్య కారు అతివేగంగా అజాగ్రత్తగా నడపడంతో అదుపు తప్పి డివైడర్ దాటి.. సికింద్రాబాద్ వైపు నుంచి తుర్కపల్లి జీనోమ్‌వ్యాలీలోని బయోలాజికల్ ఇ లిమిటెడ్ సంస్థకు చెందిన బస్సును, అటువైపు వెళ్తున్న ఓ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టి పల్టీ కొట్టింది. కారులోని శేఖర్ మోహన్ వాలే, దీపికలు సంఘటన స్థలంలోనే మృతి చెందారు. జీనోమ్‌వ్యాలీలోని లారస్ ల్యాబ్‌లో విధులకు ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఉద్యోగి శుబిదాస్(26)కు తీవ్ర గాయాలయ్యాయి. బస్సులో వెళ్తున్న 10మంది ఉద్యోగులకు స్పల్పగాయాలయ్యాయి. క్షతగాత్రులను అంబులెన్స్‌లో ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించారు. ఈ రోడ్డు ప్రమాదంతో రెండు కి.మీ పొడవునా వాహనాలు స్తంభించి పోయాయి.