తెలంగాణవీణ జాతీయం : పారిశ్రామిక రంగానికి ఊతమిస్తూ.. దేశీయ తయారీని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈసారి బడ్జెట్ 2024-2025లో కస్టమ్స్ డ్యూటీ పై భారీగా కోతలు విధించింది. ఫలితంగా ఎలక్ట్రానిక్, విలువైన లోహాలు, కీలక ఔషధాల ధరలు కొంతమేరకు తగ్గనున్నాయి. మరికొన్ని వస్తువులపై మాత్రం ఈ డ్యూటీని పెంచారు. ఆభరణాలు మరింత చౌక..
గత కొన్నేళ్లుగా నగలు, వజ్రాల ఎగుమతి వ్యాపారులు ప్రభుత్వానికి చేస్తున్న డిమాండ్ ఇప్పుడు నెరవేరింది. బంగారంపై ఉన్న బేసిక్ కస్టమ్స్ డ్యూటీని ఈసారి బడ్జెట్‌లో తగ్గించారు. పుత్తడి, వెండి వస్తువులు, కడ్డీలపై కస్టమ్స్ డ్యూటీని 15 శాతం నుంచి 6 శాతానికి కుదించారు. ఇక ప్లాటినమ్, పల్లాడియం, ఓస్మియుమ్, రుథేనియం, ఇరీడియంపై 15.4 శాతం నంచి 6.4 శాతానికి తగ్గించారు. ఈ నిర్ణయంతో భారత్ నుంచి పుత్తడి ఆభరణాల ఎగుమతులు పెరుగుతాయని ఆశిస్తున్నారు. తక్కువకు ముడిబంగారం కొనుగోలు చేసి.. దేశీయంగా దానికి అదనపు విలువను జోడించి విక్రయించే అవకాశాలు మెరుగయ్యాయి. భారీగా పతనమైన పుత్తడి ధరలు
బడ్జెట్ ఎఫెక్ట్ అప్పుడే పుత్తడిపై పడింది. బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి ప్రకటనతో బంగారం మార్కెట్లో ధరలు (gold price) భారీగా పతనం అయ్యాయి. మధ్యాహ్నానికి ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల బంగారం ధర ఒక దశలో రూ.4,000 తగ్గి రూ.68,500కు చేరుకుంది. వెండి కూడా కిలో రూ.2,500 తగ్గి రూ.84,275 వద్ద ట్రేడవుతోంది. ఆర్థిక మంత్రి ఏం చెప్పారు..క్యాన్సర్ రోగులకు ఊరటనిచ్చేందుకు వీలుగా మరో మూడుకీలక ఔషధాలపై కస్టమ్స్ డ్యూటీని పూర్తిగా తొలగించారు. మొబైల్ ఫోన్, మొబైల్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ (పీసీబీఏ), మొబైల్ ఛార్జర్‌పై డ్యూటీని 15 శాతానికి తగ్గించారు. దేశీయంగా మొబైల్ ఫోన్ల తయారీ మూడు రెట్లు పెరగ్గా.. ఎగుమతులు 100 రెట్లు పెరిగాయి. తాజా నిర్ణయాలతో అది మరింత ఊపందుకొంటుందని భావిస్తున్నారు. పారిశ్రామిక, ఎలక్ట్రానిక్స్ సహా పలు రంగాల్లో వాడే 25 అరుదైన ఖనిజాలపై కస్టమ్స్ డ్యూటీ మినహాయింపు ఇచ్చారు. వీటిల్లో నికెల్, బ్లాస్టర్ కాపర్, నికెల్ కాథోడ్ ఉన్నాయి. ఇవికాక మరో రెండింటిపై 2.5శాతం తగ్గించారు. వీటిల్లో కాపర్ స్క్రాప్ ఉంది. వ్యూహాత్మక, ముఖ్య రంగాలకు ఖనిజాలను అందుబాటులోకి తెచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకొన్నారు. బ్రూడ్‌స్టాక్స్, పాలీచాట్స్ వార్మ్, రొయ్యలు, చేపల ఫీడ్‌పై కస్టమ్స్ డ్యూటీ 5 శాతానికి కుదింపు.
ఫిల్లింగ్ మెటీరియల్‌గా వాడే బాతు ఈకలపై కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు.
మిథలిన్ డైఫినైల్ డైసోసైనెట్‌పై డ్యూటీని 7.5-5 శాతానికి కుదింపు.
కనెక్టర్ల, రెసిస్టర్లు తయారుచేసే ఆక్సిజన్ ఫ్రీ కూపర్‌పై కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు.
టెలికామ్ రంగంలో వినియోగించే కొన్ని రకాల పరికరాల్లోని పీసీబీఏ కస్టమ్స్ డ్యూటీ 10 నుంచి 15 శాతానికి చేరింది. దేశీయంగా తయారీ పరిశ్రమను పోత్సహించేందుక ఈ నిర్ణయం తీసుకొన్నారు. గత కొన్నేళ్లుగా ప్రభుత్వం వీటిపై కస్టమ్స్ డ్యూటీని పెంచుతోంది. ఈ నిర్ణయం టెలికం కంపెనీలపై భారం మరింత పెంచనుంది. సెల్యూలర్ ఆపరేటర్స్ అసోసియేషన్ కొన్నేళ్లగా వీటిపై పన్నులు తగ్గించాలని కోరుతుండటం గమనార్హం.