తెలంగాణవీణ జాతీయం : వన్డే ప్రపంచకప్ తర్వాత ఆటకు దూరంగా ఉన్న భారత స్టార్ పేసర్ మహ్మద్ షమి త్వరలో టీమ్‌ఇండియా జెర్సీలో కనిపించనున్నాడు. చీలమండ గాయానికి శస్త్రచికిత్స చేయించుకున్న షమి ప్రస్తుతం కోలుకున్నాడు. దీంతో భారత జట్టులోకి పునరాగమనానికి సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలోనే ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. ప్రస్తుతం నెట్స్‌లో జాగ్రత్తగా బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. పూర్తిస్థాయి తీవ్రతతో బౌలింగ్ చేయడానికి మరికొన్ని రోజులు పట్టే అవకాశముంది. తాను బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను షమి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. షమి ఆగస్టు నాటికి పూర్తిస్థాయిలో బౌలింగ్ చేస్తే సెప్టెంబరులో బంగ్లాదేశ్‌తో జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌తో టీమ్‌ఇండియాలోకి రీ ఎంట్రీ ఇచ్చే అవకాశముంది. తర్వాత భారత్.. న్యూజిలాండ్‌తో మూడు టెస్టులు ఆడనుంది. బోర్డర్-గావస్కర్ ట్రోఫీ కోసం నవంబర్‌లో భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. వన్డే ప్రపంచకప్‌లో షమి అద్భుత ప్రదర్శనతో అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచాడు. ప్రపంచకప్‌లో షమి చీలమండకు గాయమైంది. గాయం వేధిస్తుండగానే అతడు కొన్ని మ్యాచ్‌లు ఆడినట్లు తెలిసింది. దీంతో దీని తీవ్రత ఎక్కువైంది. ఆస్ట్రేలియాతో ఫైనల్ ముగిసిన తర్వాత లండన్ వెళ్లి చీలమండ గాయానికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. దీంతో 2024 ఐపీఎల్ సీజన్‌తోపాటు ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచ కప్‌నకు కూడా దూరమయ్యాడు.