తెలంగాణవీణ జాతీయం ; విశ్వప్రసిద్ధ శ్రీక్షేత్రంలో పూరీ జగన్నాథుని రత్నభాండాగారాన్ని అధికారులు ఆదివారం తెరిచిన విషయం తెలిసిందే. యావత్ దేశం ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న వేళ 46 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆలయంలోని రహస్య గది తలుపులు మెజిస్ట్రేట్ సమక్షంలో తెరిచారు. ఈ సందర్భంగా స్వామివారికి చెందిన విలువైన వస్తువుల్ని లెక్కించేందుకు 11మందితో ఏర్పాటు చేసిన బృందానికి సారథ్యం వహిస్తున్న ఒడిశా హైకోర్టు విశ్రాంత జడ్జి జస్టిస్ బిశ్వనాథ్ రథ్ మాట్లాడారు. మేజిస్ట్రేట్ సమక్షంలో గది తాళాలు పగలగొట్టిన తర్వాత తమ బృందం గదిలోకి ప్రవేశించిందని తెలిపారు. ఆ ‘రహస్య గది’ లోపల భాండాగారానికి పాములు కాపలాగా ఉన్నాయంటూ పెద్ద ఎత్తున జరిగిన ప్రచారాన్ని ఆయన తోసిపుచ్చారు. తమ బృందంలో ఏడెనిమిది మంది ఆలయ మేనేజ్‌మెంట్ సభ్యులు ఉన్నారని.. వీరంతా బహుడా యాత్ర సన్నహాల్లో బిజీగా ఉన్నందున తనిఖీలకు, ఆభరణాల తరలింపునకు తగిన సమయం లభించలేదని చెప్పారు. అందువల్ల దేవతామూర్తుల ఆభరణాలు, విలువైన రత్నాలను తరలింపునకు మరో తేదీని నిర్ణయిస్తామని తెలిపారు.
జగన్నాథ్ ఆలయం పాలనాధికారి అరవింద పాఢి మాట్లాడుతూ.. అవుటర్ ట్రెజరీలో భద్రపరిచిన ఆభరణాలను ఆలయం ప్రాంగణం లోపల తాత్కాలికంగా ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌కు తరలించినట్లు చెప్పారు. ఆ తర్వాత దీనికి మెజిస్ట్రేట్ సమక్షంలో సీలు వేసినట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. పెంచిన తల్లి సన్నిధిలో జగన్నాథుని లీలలు ఆదివారంతో ముగియడంతో సోమవారం బలభద్ర, సుభద్ర, సుదర్శనులతో కలిసి స్వామి శ్రీ క్షేత్రానికి బయల్దేరారు. నందిఘోష్, తాళధ్వజ, దర్పదళన్ రథాలపై చేరుకోనున్నారు. ఈ వేడుకనే బహుడా యాత్రగా పేర్కొంటారు. ఇప్పటికే ఈ యాత్ర కొనసాగుతోంది. దాదాపు 8లక్షల మంది భక్తులు పాల్గొంటారనే అంచనాలతో అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.