తెలంగాణవీణ,సినిమా ; నటుడు కిరణ్ అబ్బవరం, నటి రహస్య గోరక్ వివాహానికి ముహూర్తం ఖరారైంది. వచ్చే నెలలో వీరి పెళ్లి జరగనుంది. తనకు కాబోయే భర్త కిరణ్ అబ్బవరం పుట్టినరోజును పురస్కరించుకుని రహస్య ఈ విషయాన్ని బయటపెట్టారు. ఆయనకు బర్త్‌డే విషెస్ చెబుతూ ఇన్‌స్టాలో ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ‘రాజావారు రాణిగారు’ సమయం నుంచి నిశ్చితార్థమైన నాటివరకూ వీరిద్దరూ కలిసి దిగిన పలు ఫొటోలు, వీడియోలతో స్పెషల్ వీడియో క్రియేట్ చేసి దాన్ని అభిమానులతో పంచుకున్నారు. ‘‘హ్యాపీ బర్త్‌డే కిరణ్ అబ్బవరం. మరో 38 రోజుల్లో నిన్ను.. మై హస్బెండ్ అనేందుకు ఆశగా ఎదురుచూస్తున్నా’’ అని ఆమె క్యాప్షన్ జత చేశారు.
2019లో విడుదలైన ‘రాజావారు రాణిగారు’తోనే కిరణ్ తెరంగేట్రం చేశారు. ఇందులో రహస్య కథానాయికగా నటించారు. రొమాంటిక్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించింది. ఆ మూవీ షూటింగ్‌లోనే ఇద్దరి మధ్య ఏర్పడిన స్నేహం.. ప్రేమగా మారినట్లు తెలుస్తోంది. మార్చిలో వీరి నిశ్చితార్థం జరిగింది. కిరణ్ ప్రస్తుతం ‘క’ కోసం వర్క్ చేస్తున్నారు. పాన్ ఇండియా ఫిల్మ్‌గా ఇది విడుదల కానుంది. సుజీత్, సందీప్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. సోమవారం ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని ‘క’ టీజర్ విడుదల చేశారు.