తెలంగాణవీణ, జాతీయం : భారతదేశ శ్రీమంతుడు ముఖేశ్ అంబానీ, నీతా అంబానీ దంపతుల చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం ముంబైలో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. జులై 12 వివాహ వేడుక జరిగింది. పెళ్లి తర్వాత శుభ్ ఆశీర్వాద్, నిన్న మంగళ్ ఉత్సవ్ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులకు నీతా అంబానీ కృతజ్ఞతలు తెలియజేశారు. అంతేకాదు, తమ వల్ల ఏదైనా తప్పులు జరిగి ఉంటే క్షమించాలని మీడియాను కోరారు. పెళ్లి సందర్భంగా చిన్నిచిన్ని పొరపాట్లు జరిగే అవకాశం ఉందని తెలిపారు. మీరంతా రేపు మా అతిథులుగా రావాలని కోరారు. మీకు స్వాగతం పలకడం సంతోషంగా ఉందని చెప్పారు. మరోవైపు నీతా అంబానీ మీడియాను ఉద్దేశించి మాట్లాడిన విధానాన్ని చూసి గ్రేట్ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అంతులేని సంపద ఉన్నప్పటికీ… ఆమెకు కొంచెం కూడా గర్వం లేదని కొనియాడుతున్నారు. ఇంకోవైపు, నిన్న జరిగిన వెడ్డింగ్ రిసెప్షన్ మరోసారి బాలీవుడ్ స్టార్లతో మెరిసిపోయింది. షారుక్ ఖాన్ వంటి కొందరు స్టార్లకు రూ. 2 కోట్ల విలువైన వాచ్ లను అనంత్ అంబానీ బహూకరించినట్టు సమాచారం.