ఒక్కసారిగా 15 కుక్కలు మహిళపై దాడికి యత్నం, తప్పించుకునేందుకు మహిళ విశ్వప్రయత్నం
అటువైపు మరో వాహనదారుడు రావడం చూసి కుక్కలు పారిపోవడంతో తప్పిన ప్రాణాపాయం
ఘటనపై సోషల్ మీడియాలో బాధితురాలి భర్త పోస్టువీధి కుక్కలకు ఆహారం పెడితే ఇలాంటి ప్రమాదాలు ఎదురవుతాయంటూ ఆవేదన
మార్నింగ్ వాకింగ్‌కు వెళ్లిన ఓ మహిళపై ఏకంగా 15 కుక్కలు దాడి చేసిన ఘటన హైదరాబాద్‌లో కలకలం రేపుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రాయదుర్గం పరిధిలోని చిత్రపురి కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఒక్కసారిగా చుట్టుముట్టిన వీధి శునకాల నుంచి తప్పించుకునేందుకు ఆ మహిళ గట్టిగా కేకలు వేసింది. వాటి నుంచి తప్పించుకునే క్రమంలో ఆమె ఓసారి కిందపడి లేచింది. ఇంతలో ఓ వాహనదారుడు అటువైపు రావడంతో కుక్కలన్నీ పారిపోయాయి.
కాగా, ఘటనపై బాధితురాలి భర్త స్పందించారు. అదృష్టం బాగుండబట్టి తన భార్య ప్రాణాలతో బయటపడిందని వ్యాఖ్యానించారు. వీధి కుక్కలకు ఇళ్ల బయట ఆహారం పెట్టొద్దని ఆయన ప్రజలకు సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశారు. నేడు తాము ఎదుర్కొన్న విపత్కర పరిస్థితి ఇతరులకూ ఎదురు కావచ్చని హెచ్చరించారు. మూగజీవాలంటే ప్రేమ ఉన్న వారు వీధికుక్కలను ఇళ్లల్లోనే పెట్టుకోవడం మంచదని సూచించారు. తద్వారా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయన్నారు. ఈ వీడియో వైరల్ కావడంతో నెట్టింట పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. వీధి కుక్కల సమస్యకు తక్షణ పరిష్కారం కనిపెట్టాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. అయితే, గతంలోనూ నగరంలో ఇలాంటి దారుణాలు వెలుగు చూశాయి. గతేడాది డిసెంబర్‌లో షేక్‌పేటకు చెందిన ఓ ఐదు నెలల చిన్నారి కుక్కల దాడిలో మరణించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో శంషాబాద్‌లోని మరో చిన్నారి కుక్కల పాలపడ్డాడు. ఏప్రిల్ లో గాయత్రి నగర్‌లోని నిర్మాణంలో ఉన్న భవనంలో ఉన్న రెండున్నరేళ్ల బాలికపై వీధి కుక్కలు దాడి చేయడంతో చిన్నారి దుర్మరణం చెందింది.