- పూర్తి స్థాయి మంత్రి మండలిలో 78 నుంచి 81 మంది మంత్రులు ఉండొచ్చని అంచనా
- కీలక శాఖలు బీజేపీ వద్ద ఉండనున్నట్టు విశ్లేషణలు
- నేడు కొలువు తీరనున్న ‘మోదీ 3.0’ ప్రభుత్వం
- రాత్రి 7.15 గంటలకు దేశ ప్రధానిగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారం
తెలంగాణ వీణ..భారతదేశం:‘మోదీ 3.0’ ప్రభుత్వం నేడు (ఆదివారం) కొలువు తీరనుంది. ఇవాళ రాత్రి 7.15 గంటలకు దేశ ప్రధానిగా మూడోసారి నరేంద్ర మోదీ, అనంతరం పలువురు కేంద్ర మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. అయితే మంత్రులుగా ఎవరెవరు నేడు ప్రమాణం చేయనున్నారనేది ఆసక్తికరంగా మారింది. కాగా ఈ రోజు 30 మంది నేతలు కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఈ మేరకు బీజేపీ వర్గాల సమాచారం ఉందని సదరు కథనాలు పేర్కొంటున్నాయి. అయితే ఒకటి కంటే ఎక్కువ పోర్ట్‌ఫొలియోలను కలిగివుండే మంత్రుల సంఖ్య చాలా తక్కువగా ఉండనుందని తెలుస్తోంది. పూర్తి స్థాయి మంత్రి మండలిలో 78 నుంచి 81 మంది మంత్రులు ఉండే అవకాశం ఉందని ఎన్డీటీవీ కథనం పేర్కొంది.కాగా నరేంద్ర మోదీ కేబినెట్‌లో పలువురు మాజీ ముఖ్యమంత్రులు కూడా చేరే అవకాశం ఉందని ఎన్డీటీవీ కథనం పేర్కొంది. ఇక కీలకమైన హోంశాఖ, రక్షణ, ఆర్థిక, విదేశీ వ్యవహారాల శాఖలు బీజేపీ వద్దనే ఉండనున్నాయని విశ్లేషించింది. మౌలిక సదుపాయాలకు సంబంధించి కీలకమైన శాఖలైన ఉక్కు, పౌర విమానయాన, బొగ్గు మంత్రిత్వ శాఖలను కూడా బీజేపీ అట్టిపెట్టుకునే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.ప్రధానిగా నేడు ప్రమాణస్వీకారం చేయనున్న నరేంద్ర మోదీ.. వరుసగా మూడు పర్యాయాలు ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రెండవ వ్యక్తిగా ఆయన నిలవనున్నారు. మోదీ కంటే ముందు జవహర్‌లాల్ నెహ్రూ 1952, 1957, 1962లలో వరుసగా మూడుసార్లు దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.