- ఫుడ్ సేఫ్టీ రూల్స్ పాటించడం లేదని అధికారుల ఆరోపణ
- ఫొటోలు మీడియాకు విడుదల చేసిన ఫుడ్ సేఫ్టీ కమిషనర్
- నాణ్యత విషయంలో తాము రాజీపడబోమని జొమాటో వివరణ
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ‘బ్లింకిట్’ తన వేర్ హౌస్ లో నాణ్యతా ప్రమాణాలు పాటించడంలేదని ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆరోపించారు. హైదరాబాద్ లోని ఆ సంస్థ వేర్ హౌస్ పై తాజాగా రెయిడ్ చేయగా.. విస్తుపోయే విషయాలు బయటపడ్డాయని చెప్పారు. ఈమేరకు ఫుడ్ సేఫ్టీ కమిషనర్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్న వివరాలు.. బ్లింకిట్ ను ఇటీవలే జొమాటో కొనుగోలు చేసింది. వ్యాపార విస్తరణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది.కొన్ని రోజులుగా హైదరాబాద్ లోని వివిధ హోటళ్లలో తనిఖీలు చేపట్టిన ఫుడ్ సేఫ్టీ అధికారులు తాజాగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దేవరయాంజల్ లోని బ్లింకిట్ వేర్ హౌస్ లోనూ సోదాలు చేశారు. నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అనేది తెలుసుకోవడానికి జరిపిన ఈ తనిఖీలలో బ్లింకిట్ నిర్లక్ష్యం బయటపడింది. సదరు వేర్ హౌస్ లో ఎక్కడా పరిశుభ్రత అనేదే కనిపించలేదని, పలు ఆహార పదార్థాలు ఎక్స్ పైరీ అయినప్పటికీ దానిని మరుగుపరిచి కస్టమర్లకు అంటగడుతున్నారని ఫుడ్ సేఫ్టీ కమిషనర్ చెప్పారు. రూల్స్ ఉల్లంఘనలకు సంబంధించి సంస్థకు నోటీసులు పంపినట్లు తెలిపారు.ఈ విషయంపై జొమాటో స్పందిస్తూ.. కస్టమర్లకు అందించే ఆహార పదార్థాలు, ఇతర వస్తువుల విషయంలో నాణ్యతకే తాము పెద్ద పీట వేస్తామని వివరణ ఇచ్చింది. బ్లింకిట్ ను ఇటీవలే కొనుగోలు చేసిన విషయాన్ని గుర్తుచేసింది. అదే సమయంలో అధికారుల తనిఖీలలో బయటపడ్డ నాణ్యతా లోపాలను సరిదిద్దుకుంటామని, ఈ విషయంలో అధికారుల సూచనలు తప్పకుండా అమలు చేస్తామని ఓ ప్రకటనలో తెలిపింది.