- ట్రయల్ రన్ లో గంటకు 99 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన రైలు
- తొలినాళ్లలో సగటున 84.48 కి.మీ. వేగంతో నడిపిన అధికారులు
- ప్రస్తుతం గంటకు సగటున 76.25 కి.మీ. వేగంతో నడుస్తున్నట్లు వెల్లడి
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన వందేభారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ల వేగం తగ్గిపోయింది. తొలినాళ్లలో గంటకు సగటున 84.48 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీసిన ఈ రైళ్లు ప్రస్తుతం సగటున 76.25 కిలోమీటర్ల వేగంతో నడుస్తున్నాయి. ఈమేరకు ఓ ఆర్టీఐ కార్యకర్త చేసిన దరఖాస్తుకు ఇచ్చిన జవాబులో రైల్వే శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు ట్రయల్ రన్ లో గంటకు 99 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది. తొలినాళ్లలో (2020-21) వందేభారత్ రైళ్లు సగటున 84.48 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీశాయని రైల్వే అధికారులు తెలిపారు. ఆ తర్వాతి కాలంలో దేశ భౌగోళిక పరిస్థితులు, వాతావరణ కారణాల వల్ల కొన్ని రూట్లలో నడిచే వందేభారత్ రైళ్ల వేగాన్ని తగ్గించినట్లు చెప్పారు.2022-23 నాటికి ఈ రైళ్ల వేగం గంటకు సగటున 81.38 కిలోమీటర్లకు తగ్గించినట్లు వివరించారు. వర్షాకాలంలో సగటున 75 కిలోమీటర్ల వేగంతో రైళ్లను నడపడం సవాలుతో కూడుకున్న విషయమని పేర్కొన్నారు. వాస్తవానికి వందేభారత్ రైళ్లకు గరిష్ఠంగా గంటకు 160 కి.మీ. వేగంతో దూసుకెళ్లే సామర్థ్యం ఉందని చెప్పారు. అయితే, ఆ వేగానికి మన దేశంలోని రైల్వే ట్రాక్ లు సరిపడవని, వాటి సామర్థ్యం అంతలేదని వివరించారు. కేవలం ఢిల్లీ, ఆగ్రా మధ్య ఉన్న కొన్ని ట్రాక్ లపైనే ఈ వేగాన్ని అందుకోవడం సాధ్యమని రైల్వే అధికారులు తెలిపారు.ప్రస్తుతం కూడా కొన్ని రైళ్లు గరిష్ఠంగా గంటకు 160 కి.మీ. వేగంతో పరుగులు పెడుతున్నాయని వివరించారు. మరికొన్ని ట్రాక్ లపై గరిష్ఠ వేగం చాలా తక్కువన్నారు. ఉదాహరణకు డెహ్రడూన్ – ఆనంద్ విహార్ ట్రాక్ పై రైళ్ల వేగం సగటున 63.42 కిలోమీటర్లు, పాట్నా – రాంచీ ట్రాక్ పై 62.9 కి.మీ., కోయంబత్తూర్ – బెంగళూర్ ట్రాక్ పై గంటకు 58.11 కిలోమీటర్ల వేగంతో మాత్రమే రైళ్లు నడుస్తాయని అధికారులు వివరించారు.