- రామోజీ అస్తమయంపై విచారం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే
- తెలుగు పత్రికారంగంలో మకుటంలేని మహారాజు..
- ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ సిటీని ఏర్పాటు చేశారని వ్యాఖ్య
తెలంగాణ వీణ ..ఆంధ్రప్రదేశ్: దేశ పత్రికారంగంలోనే రామోజీరావు ఓ కొత్త ఒరవడి సృష్టించారని సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. తెలుగు పత్రికారంగంలో ఆయన ఓ మకుటం లేని మహారాజు అని అన్నారు. రాబోయే తరాల పత్రికా ప్రతినిధులకు ఓ మార్గదర్శిగా నిలిచారని చెప్పారు. చిత్రసీమలోనూ అడుగుపెట్టి, ఉషోదయ సంస్థను విజయవంతంగా నడిపించారని వివరించారు. ప్రపంచంలోనే అతిపెద్ద స్టూడియోను నిర్మించి దేశానికి గర్వకారణమయ్యారని చెప్పారు.
తెలుగు నేలపై నిర్మించిన రామోజీ ఫిల్మ్ సిటీ ద్వారా సినీ పరిశ్రమకు ఎనలేని సేవ చేశారన్నారు. తన తండ్రి ఎన్టీఆర్, రామోజీరావుల మధ్య ప్రత్యేకమైన అనుబంధం ఉండేదని బాలకృష్ణ గుర్తుచేసుకున్నారు. రామోజీ రావు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు బాలకృష్ణ చెప్పారు. ఈ సందర్భంగా రామోజీ కుటుంబ సభ్యులకు నందమూరి బాలకృష్ణ సానుభూతి తెలిపారు.