- వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు రాజీనామా లేఖ పంపిన రావెల
- 2014లో చంద్రబాబు రాజకీయంగా అవకాశం ఇచ్చి ప్రోత్సహించారని వ్యాఖ్య
- ఇందుకుగాను టీడీపీ అధినేతకు కృతజ్ఞతలు తెలిపిన మాజీ మంత్రి
- 2014 ఎన్నికల్లో ప్రత్తిపాడు నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన కిశోర్ బాబు
- 2019లో జనసేన నుంచి పోటీ చేసి ఓటమి
తెలంగాణ వీణ,హైదరాబాద్:మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు వైసీపీకి గుడ్‌బై చెప్పారు. తన రాజీనామా లేఖను ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌కు పంపించారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీ అధినేత చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు. తాను డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలకు కట్టుబడి పనిచేశానని.. 2014లో తనకు చంద్రబాబు రాజకీయంగా అవకాశం ఇచ్చి ప్రోత్సహించారని గుర్తు చేసుకున్నారు. 2014లో ఏపీలో తొలి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసేందుకు అవకాశం కల్పించిన టీడీపీ బాస్‌కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. అయితే, దురదృష్టవశాత్తూ కొన్ని కారణాలతో టీడీపీలో కొనసాగలేకపోయినందుకు ఎప్పుడూ బాధపడుతూనే ఉంటానని తెలిపారు. మళ్లీ చంద్రబాబు నాయకత్వంలో పనిచేసేందుకు ఎన్నోసార్లు ప్రయత్నించినా సఫలం కాలేదని వాపోయారు. ఇక వైఎస్ జగన్.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రాజ్యాధికారం తెస్తానన్న మాటలు నమ్మి తాను వైసీపీలో చేరినట్లు తెలిపారు. కానీ, ఈ ఎన్నికల్లో మెజారిటీ ప్రజలు ఆయనను తిరస్కరించారని పేర్కొన్నారు. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అది చంద్రబాబు వల్లనే సాధ్యమవుతుందన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ప్రజలు అఖండ విజయం ఇచ్చారని ప్రశంసించారు.మరోవైపు మంద కృష్ణమాదిగ 40 ఏళ్లుగా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్నారని, ఇప్పుడు ఆ అంశం ముగింపునకు వచ్చిందని భావిస్తున్నానని రావెల అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, చంద్రబాబు ఇద్దరూ వర్గీకరణకు మద్దతు తెలిపారని, అందుకే వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని స్పష్టం చేశారు. సామాజిక సేవ చేస్తూనే.. వర్గీకరణ అంశం కోసం తన వంతు ప్రయత్నం చేస్తానన్నారు. దానికి అనుకూలంగా ఉన్న పార్టీలో చేరే విషయాన్ని ఆలోచిస్తానని తెలిపారు.ఇదిలాఉంటే.. 2014 ఎన్నికల్లో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన రావెల కిశోర్‌బాబు.. చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. అయితే 2019 ఎన్నికల ముందు జనసేనలో చేరి ఆ పార్టీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత కొన్ని రోజులకే ఆయన బీజేపీలో చేరారు. ఆ తర్వాత ఆ పార్టీకి కూడా రాజీనామా చేసిన ఆయన.. కేసీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. కొంత కాలం తర్వాత బీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పి.. వైసీపీలో చేరారు. ఇప్పుడు ఆ పార్టీకి కూడా రావెల కిషోర్‌బాబు రాజీనామా చేశారు