Tuesday, December 24, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

వడ్డీ రేట్లు యథాతథం.. ఆర్‌బీఐ కీల‌క ప్ర‌క‌ట‌న‌!

Must read

  • వరుసగా 8వసారి రెపో రేటును 6.5 శాతంగా ఉంచిన‌ ఆర్‌బీఐ
  • 2023 ఏప్రిల్ నుంచి యథాతథంగా కొనసాగుతున్న రెపో రేటు
  • ద్రవ్యోల్బణం, వృద్ధి మధ్య సమతుల్యత కొనసాగుతోందన్న‌ ఆర్‌బీఐ గవర్నర్
  • ద్రవ్యోల్బణాన్ని 4 శాతం వద్ద ఉంచడానికి ఆర్బీఐ కట్టుబడి ఉందన్న శ‌క్తికాంత దాస్‌

తెలంగాణ వీణ,హైదరాబాద్:మానిట‌రీ పాలసీ కమిటీ మీటింగ్ ముగింపు నేపథ్యంలో వడ్డీ రేట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ కీల‌క‌ ప్రకటన చేశారు. కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతున్నట్టు వెల్లడించారు. మానిట‌రీ పాలసీ కమిటీ మీటింగ్ లో ఆరుగురు సభ్యులు ఉంటారు. ఈసారి కూడా వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచాలని ఆరుగురులో నలుగురు ఓటు వేశారని ఆర్బీఐ గవర్నర్ స్పష్టం చేశారు. ఫలితంగా వరుసగా 8వసారి రెపో రేటును 6.5 శాతంగా ఉంచింది ఆర్బీఐ. 2023 ఏప్రిల్ నుంచి రెపో రేటును ఆర్‌బీఐ యథాతథంగా కొనసాగిస్తూ వస్తోంది. 

అసలెంటీ రెపో రేటు..
రిజ‌ర్వ్ బ్యాంక్‌ దేశంలోని బ్యాంక్లకు డబ్బులను అప్పుగా ఇస్తుంది. ఆ అప్పుపై వడ్డీని వసూలు చేస్తుంది. దానినే రెపో రేట్ అంటారు. రెపో రేట్ పెరిగితే.. అధిక వడ్డీ చెల్లించాల్సి వస్తుంది కాబట్టి బ్యాంక్లకు కష్టమవుతుంది. అందుకే బ్యాంక్లు కూడా వివిధ లోన్లపై వడ్డీని పెంచుతాయి. ఇది కస్టమర్లను ప్రభావితం చేస్తుంది. రెపో రేటు తగ్గితే.. ఆర్బీఐకి బ్యాంక్లు ఇచ్చే వడ్డీ కూడా తగ్గుతుంది. త‌ద్వారా ప్రజలకు బ్యాంకులు ఇచ్చే రుణాలపై వడ్డీ రేట్లు దిగొస్తాయి. ఇక రెపో రెట్లు మారకపోవడంతో ప్రస్తుతం దేశంలో ఉన్న వివిధ లోన్లపై వడ్డీ రేట్లు కూడా పెద్దగా మారే అవకాశం లేదు.

ఆర్‌బీఐ మానటరీ పాలసీ నిర్ణయాలివే..

  1. ద్రవ్యోల్బణం, వృద్ధి మధ్య మంచి సమతుల్యత కొనసాగుతోందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. ద్రవ్యోల్బణాన్ని 4 శాతం వద్ద ఉంచడానికి ఆర్‌బీఐ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. అయితే ఆహార ద్రవ్యోల్బణం పెరుగుతుండడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
  2. నైరుతి రుతుపవనాలు ఖరీఫ్ సీజన్లో పంటల ఉత్పత్తిని పెంచుతాయని ఆశిస్తున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే దీని వల్ల రిజర్వాయర్లలో నీటి నిల్వలు పెరుగుతాయని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
  3. రిటైల్ ద్రవ్యోల్బణం 2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 4.9 శాతం, రెండో త్రైమాసికంలో 3.8 శాతం, మూడో త్రైమాసికంలో 4.6 శాతం, నాల్గో త్రైమాసికంలో 4.5 శాతం ఉండొచ్చని ఆర్బీఐ అంచనా వేసింది.
  4. అనుకున్నట్లుగా సకాలంలో మంచి వర్షాలు పడితే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 4.5 శాతం ఉండవచ్చు. ఒకవేళ ఇలా జరగకపోతే ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉందని ఆర్‌బీఐ గవర్నర్ పేర్కొన్నారు.
  5. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రిటైల్ ద్రవ్యోల్బణంలో కొంత మేరకు దిద్దుబాటు జరగవచ్చని శక్తికాంత దాస్ అన్నారు.
  6. ప్రపంచ రెమిటెన్స్‌ల్లో 15.2 శాతం వాటాతో ఇండియా అతిపెద్ద రిసీవింగ్ (స్వీకరించే) దేశంగా కొనసాగుతోందని శక్తికాంత దాస్ తెలిపారు.
  7. ఇండియన్ రూపాయి సాపేక్ష స్థిరత్వంతో కొనసాగుతోంది. ఇది మన దేశ బలమైన, స్థితిస్థాపక ఆర్థిక మూలాలకు నిదర్శనంగా ఉందని శక్తికాంత దాస్ పేర్కొన్నారు.
  8. “వినియోగదారుల రక్షణకే ఆర్‌బీఐ ప్రథమ ప్రాధాన్యత ఇస్తుంది. అయితే కొన్ని సంస్థలు ఇప్పటికీ సరైన పారదర్శక విధానాలు పాటించకుండా కొన్ని రకాల రుసుములు వసూలు చేస్తున్నాయి. వీటిపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. అలాగే అసురక్షిత రుణాలు, అడ్వాన్స్‌ల‌ను ఇవ్వడానికి చర్యలు తీసుకుంటాం” అని శక్తికాంత దాస్ పేర్కొన్నారు
  9. ఎఫ్‌వై 2024 వార్షిక ఆర్థిక ఫలితాలు మన దేశ బ్యాంకింగ్ వ్యవస్థ పటిష్టంగా, స్థితిస్థాపకంగా ఉన్నాయని సూచిస్తున్నాయ‌ని ఆర్‌బీఐ పేర్కొంది.
  10. 2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అత్యవసర రిస్క్ బఫర్ (నిల్వలను) 0.5 శాతం పెంచడం వల్ల ఆర్‌బీఐ బ్యాలెన్స్ షీట్ మరింత మెరుగుపడుతుందని శక్తికాంత దాస్ అన్నారు.
  11. 2024 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం నాటికి కరెంట్ ఖాతా లోటును మోడరేట్ అవుతుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు.
  12. 2024 ఆర్థిక సంవత్సరంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు బలంగా ఉన్నప్పటికీ, నికర విదేశీ పెట్టుబడులు కాస్త మితంగానే ఉన్నాయి.

స్టాక్ మార్కెట్లకు జోష్..
వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచినప్పటికీ జీడీపీ వృద్ధి అంచనాలను ఆర్బీఐ పెంచడంతో స్టాక్ మార్కెట్లకు జోష్ లభించింది. శక్తికాంత దాస్ ప్రకటనతో శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో దేశీయ సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 728 పాయింట్లు పెరిగి 75,802 వద్ద ట్రేడ్ అవుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 225 పాయింట్ల లాభంతో 23,046 వద్ద కొనసాగుతోంది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you