- ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్‌లో ఘటన
- చేతిలో చెయ్యేసుకుని పోలీస్ స్టేషన్‌కు వచ్చిన బాలికలు
- ప్రేమించుకున్నామని, విడిచి ఉండలేమని పెళ్లి చేయాలని అభ్యర్థన
- నచ్చజెప్పే ప్రయత్నం చేసినా అంగీకరించని బాలికలు
- చివరికి వారి తల్లిదండ్రులకు కబురుపెట్టిన పోలీసులు
తెలంగాణ వీణ,హైదరాబాద్:తమకు పెళ్లి చేయాలంటూ పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన ఇద్దరు బాలికలను చూసిన పోలీసులు నోరెళ్లబెట్టారు. ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్‌లో జరిగిందీ ఘటన. 14, 15 ఏళ్ల వయసునున్న ఇద్దరు బాలికలు బుధవారం చేతిలో చెయ్యేసుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. విషయం ఏంటని పోలీసులు ప్రశ్నించగా, వారు చెప్పింది విని నిర్ఘాంతపోయారు. తామిద్దరం ప్రేమించుకున్నామని, ఒకరిని విడిచి మరొకరం జీవించలేమని, దయచేసి తమకు పెళ్లి చేసి జీవితాంతం కలిసి ఉండేలా చూడాలని ప్రాధేయపడ్డారు.వారి అభ్యర్థనకు షాక్ అయిన పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అది సరికాదని, మీరింకా బాలికలేనని, సమాజం హర్షించదని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వారు వినిపించుకోలేదు సరికదా.. కాదంటే ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించే ప్రయత్నం చేశారు. చివరికి ఇలా కాదని, వారి తల్లిదండ్రులను పిలిపించిన పోలీసులు వారి సమక్షంలో మరో రెండు గంటలు కౌన్సెలింగ్ ఇచ్చి బాలికలను ఒప్పించి పంపించడంతో కథ సుఖాంతమైంది.