తెలంగాణవీణ ,తెలంగాణా ; జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఒక్కసారిగా వాతావరణం మారి భారీవర్షం కురిసింది. తీవ్ర ఎండవేడిమి , ఉక్కపోతతో అల్లాడిన ప్రజలు ఈ వర్షంతో కాస్తా ఉపశమనం పొందారు. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. నగరానికి ఉత్తరంగా ఉన్న జీడిమెట్ల, చింతల్, గాజులరామారం, షాపూర్‌నగర్, కాటారం, మహదేవపూర్ మండలాలలో గాలివాన బీభత్సం సృష్టించింది.మహదేవపూర్ నుండి కాళేశ్వరం వెళ్లే 353 వ జాతీయ రహదారిపై నాలుగు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సుమారు గంట పాటు ఇరువైపుల వాహనాలు రోడ్డుపై నిలిచాయి. స్థానికులు ట్రాక్టర్ సహాయంతో చెట్లను తొలగించడంతో రాకపోకలు కొనసాగాయి. మరోవైపు కాటారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర భారీ వృక్షం విరిగి రోడ్డుపై పడింది.ఈ సమయంలో మనుషులు ఎవరు లేక పోవడంతో పెను ప్రమాదం తప్పింది. 11 కెవి విద్యుత్ వైర్లపై వృక్షం పడడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.రైతులు కళ్లాలలో ఆరబెట్టిన వరిధాన్యం ఈ అకాల వర్షానికి తడిసి ముద్దాయ్యాయి. రైతులు ఆందోళన చెందుతున్నారు. తడిసిన ధ్యాన్యాన్ని ఆరబెట్టుకోవాలన్నా ఇంకా మూడు రోజులు వర్షాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని రైతన్న వేడుకుంటున్నాడు. కాగా.. నగరంలో అరగంట పాటు కురిసిన ఈదురు గాలులకు ఆయా ప్రాంతాల్లోని కాలనీల్లో పార్క్ చేసిన వాహనాలపై చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి.
రాత్రి 9 గంటల వరకు జీడిమెట్లలో 4.48 సెం.మీ, గాయత్రీనగర్, గాజులరామారంలో 3.0 సెం.మీ, మోండామార్కెట్, కూకట్‌పల్లి రాజీవ్ గృహకల్ప ప్రాంతాల్లో 2.30, సీతాఫల్‌మండి, కుత్బుల్లాపూర్ ప్రాంతాల్లో 1.7 సెం.మీ, ముషీరాబాద్, పాటిగడ్డ, జిల్లావ్యాప్తంగా 1.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉప్పల్, చిలుకానగర్ ప్రాంతాల్లో 1.0 సెం.మీ నమోదైంది. రానున్న రెండు రోజుల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో గ్రేటర్‌లో ఎల్లో అలర్ట్ హెచ్చరికలు జారీ చేశారు.