తెలంగాణవీణ, ఏపీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మరికొందరు గాయాలపాలయ్యారు. బాపట్ల జిల్లాలోని చిన్నగంజాం నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సు పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట మండలంలో అదుపుతప్పి లారీని బలంగా ఢీకొట్టింది. దీంతో వాహనాలు రెండూ నుజ్జునుజ్జయింది. ఆ వెంటనే మంటలు అంటుకోవడంతో ఆరుగురు మంటలకు ఆహుతయ్యారు. ప్రమాద సమయంలో బస్సులో 42 మంది ఉన్నారు. మృతుల్లో లారీ డ్రైవర్, మరో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మొత్తంగా ఆరుగురు మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. మృతులను అంజి (35), ఉప్పుగుండూరు కాశీ(65), ఉప్పుగుండూరు లక్ష్మి (55), ముప్పరాజు ఖ్యాతిసాయిశ్రీ (8)గా గుర్తించారు. వీరందరూ బాపట్ల జిల్లాకు చెందినవారే. మరో ఇద్దరిని గుర్తించాల్సి ఉందని పోలీసులు తెలిపారు. గాయపడిన వారికి చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం మరింత మెరుగైన చికిత్స కోసం గుంటూరుకు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.