తెలంగాణ వీణ, జాతీయం : ముంబైలో నిన్న, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో ఘట్‌కోపర్ ప్రాంతంలో ఓ పెట్రోల్ బంక్ పక్కన ఉన్న 100 అడుగుల హోర్డింగ్ కూలిపోయింది. ఈ ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 14కు చేరుకుంది. ఈ సంఖ్య మరింత పెరగవచ్చునని ఆందోళన చెందుతున్నారు. మరో 74 మంది తీవ్రంగా గాయపడ్డారు.హోర్డింగ్ కూలిన ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిని ఏర్పాటు చేసిన ‘ఇగో మీడియా ప్రైవేట్ లిమిటెడ్’ యాడ్ ఏజెన్సీ యజమాని భవేశ్ భిండేపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటనకు కారణమైన వారిపై చర్యలు ఉంటాయని ముంబై పోలీస్ కమిషనర్ వివేక్ ఫన్సాల్కర్ పేర్కొన్నారు. ఈ హోర్డింగ్‌కు అనుమతులు లేవని పోలీసులు గుర్తించారు. హోర్డింగ్ కూలడంతో అక్కడే ఉన్న కొన్ని కార్లు నుజ్జునుజ్జు అయ్యాయి. కార్లలోనూ కొంతమంది చిక్కుకొని ఉండవచ్చునని అనుమానిస్తున్నారు.మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నగరంలోని అన్ని హోర్డింగ్‌లను తనిఖీ చేయాలని ఆదేశించారు. అక్రమంగా ఏర్పాటు చేసిన హోర్డింగ్‌లతో పాటు ముప్పు పొంచి ఉన్న వాటిని తొలగించాలని ఆదేశించారు. హోర్డింగ్ ఘటనలో కారకులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.