తెలంగాణ వీణ, అంతర్జాతీయం : గత రెండు దశాబ్దాలకు పైగా కాలంలో అత్యంత శక్తిమంతమైన సౌర తుపాను శుక్రవారం భూమిని తాకింది. ఇందుకు సంబంధించిన ఖగోళ కాంతి ఆకాశంలో కనిపించింది. టస్మానియా నుంచి బ్రిటన్ వరకు ప్రజలు ఈ కాంతిని వీక్షించారు. వారాంతం వరకు ఈ సౌర తుపాను కొనసాగితే ఉపగ్రహాలు, పవర్ గ్రిడ్‌లలో అంతరాయాలు ఏర్పడే ముప్పు ఉందని అమెరికా వాతావరణ అంచనా సంస్థ నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ (ఎన్‌వోఏఏ) వెల్లడించింది. సీఎంఈలుగా (కరోనల్ మాస్ ఎజెక్షన్స్) పిలిచే సూర్యుడి ఉద్గారాలైన అయస్కాంత క్షేత్రాలు, ప్లాస్మాలు లండన్ కాలమానం (జీఎంటీ) ప్రకారం శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో భూమిని తాకాయని వివరించింది. కాగా ఈ సౌర తుపానుకు సంబంధించి ఉత్తర యూరప్, ఆస్ట్రేలియాలలో ఏర్పడిన ‘అరోరా’లకు సంబంధించిన ఫొటోలను పలువురు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఎలాంటి పరికరాలు లేకుండా దీనిని చూడగలిగామని పలువురు పేర్కొన్నారు. తీవ్రమైన భూ అయస్కాంత తుపానుగా దీనిని ఎన్‌వోఏఏ అంచనా వేసింది. రాబోయే రోజుల్లో మరిన్ని సీఎంఈలు భూమిని తాకే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. సౌర తుపాను కారణంగా భూమి అయస్కాంత క్షేత్రంలో సంభవించే సంభావ్య అంతరాయాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఉపగ్రహ ఆపరేటర్లు, విమానయాన సంస్థలు, పవర్ గ్రిడ్‌లకు సూచించారు. కాగా అక్టోబర్ 2003లో సంభవించిన శక్తిమంతమైన సౌర తుపాను కారణంగా స్వీడన్‌లో బ్లాక్‌అవుట్‌లు ఏర్పడ్డాయి. దక్షిణాఫ్రికాలో విద్యుత్ మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి.