తెలంగాణ వీణ , హైదరాబాద్ : కవిత కేసు, అరెస్ట్‌తో తమకు ఎలాంటి సంబంధం లేదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… మద్యం కేసును ఈడీ ఏడాది కాలంగా దర్యాఫ్తు చేస్తోందన్నారు. ఢిల్లీ ప్రభుత్వంలోని పెద్దలపై కూడా ఆరోపణలు వచ్చాయని, ఆ రాష్ట్ర కేబినెట్ మంత్రి ఒకరు కూడా జైల్లో ఉన్నారని గుర్తు చేశారు. మద్యం కేసుతో కవితకు సంబంధం ఉందా? లేదా? చెప్పాలని డిమాండ్ చేశారు. చట్టం తన పని తాను చేసుకు పోతుందన్నారు. కోర్టులో కవిత తన వాదనలు వినిపించుకోవచ్చునని… నేరం చేయకుంటే శిక్ష పడదన్నారు. ఆమె నేరం చేసి ఉంటే కనుక శిక్ష పడుతుందన్నారు. తప్పు చేయకుంటే భయమెందుకో చెప్పాలన్నారు.బీఆర్ఎస్ తన తొమ్మిదిన్నరేళ్ళ కాలంలో రాష్ట్రాన్ని లూటీ చేసిందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో జరుగుతున్న అవినీతిపై కూడా విచారణ జరుగుతోందన్నారు. అవినీతి చేసిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఓబీసీలను విస్మరించిందని మండిపడ్డారు. జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్‌కు రాజ్యాంగ హోదా అప్పుడు ఎందుకు ఇవ్వలేదో రాహుల్ గాంధీ చెప్పాలని నిలదీశారు. కాంగ్రెస్ హయాంలో కులగణన ఎందుకు చేపట్టలేదు? అని నిలదీశారు. మోదీ మరోసారి ప్రధాని కావడం ఖాయమని… ఎవరూ ఆపలేరన్నారు. మోదీ విజయాలను కాంగ్రెస్ సహించలేకపోతోందన్నారు.