తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : శ్రీవారి దర్శనానికి జూన్ నెల కోటా టికెట్లను తితిదే త్వరలో విడుదల చేయనుంది. మార్చి 18 ఉదయం 10 నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆర్జిత సేవా టికెట్ల లక్కీడిప్ కోసం నమోదు చేసుకోవచ్చు. మార్చి 22న మధ్యాహ్నం 12 గంటల్లోపు సొమ్ము చెల్లించి టికెట్లను ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు తితిదే ఓ ప్రకటన విడుదల చేసింది.
మార్చి 21న ఉదయం 10 గంటలకు శ్రీవారి ఆర్జిత సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్ల కోటాను విడుదల చేయనున్నారు. జూన్ 19 నుంచి 21 వరకు జరగనున్న జ్యేష్ఠాభిషేకం ఉత్సవంలో పాల్గొనేందుకు మార్చి 21 ఉదయం 10 గంటలకు అందుబాటులో ఉంచుతారు. మార్చి 21న మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారి వర్చువల్ సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ, దర్శనం టికెట్లను విడుదల చేస్తారు. మార్చి 23న ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణ టోకెన్లు, అదే రోజు 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు దాతల దర్శనం, గదుల కోటాను అందుబాటులోకి తీసుకొస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దివ్యాంగుల దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తారు.మార్చి 25న ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఉంచుతారు. మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతి గదుల కోటాను విడుదల చేయనున్నారు. మార్చి 27న ఉదయం 11 గంటలకు తిరుమల, తిరుపతి శ్రీవారి సేవ కోటా, అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు నవనీత సేవ కోటా, ఒంటిగంటకు పరకామణి సేవ కోటాను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకురానున్నారు. తితిదే అధికారిక వెబ్‌సైట్ ద్వారా టికెట్లను బుక్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.