తెలంగాణవీణ, హైదరాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై మంత్రి ధనసరి సీతక్క ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై కవిత అనవసరంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. మహిళలను కాంగ్రెస్ నుంచి దూరం చేయాలని కవిత ప్రయత్నిస్తున్నారని, జీవో నెం 3కి వ్యతిరేకంగా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆ జీవో ఇచ్చింది కేసీఆరేనన్న విషయాన్ని కవిత గుర్తించాలని హితవు పలికారు. ఇకనైనా బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం ఆపి, ప్రజల కోసం ఆలోచించాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే సీఎం అవ్వాలని కవిత భావించారని సీతక్క ఆరోపించారు. కానీ బీఆర్ఎస్ ఓడిపోవడంతో కవిత ఆశలు అడియాసలయ్యాయని ఎద్దేవా చేశారు. మహిళలను కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తోందని అన్నారు.