తెలంగాణ వీణ, కాప్రా : దేశ పాలకుల విధానాలు నేటి యువత కర్తవ్యం అనే అంశంపై రాష్ట్ర యువజన సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు ఏ ఐ వై ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి వలి ఉల్లా ఖాద్రీ, కె. ధర్మేంద్ర లు తెలిపారు.ఏ ఐ వై ఎఫ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో వరంగల్ లో ఈ నెల 28న రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నట్లు ఈ సదస్సుకు సంబంధించిన గోడ పత్రికను హిమాయత్ నగర్, సత్యనారాయణ రెడ్డి భవన్ లో విడుదల చేశారు.ఈ సదస్సుకు రాష్ట్రంలో ఉన్న అన్ని యువజన, విద్యార్థి,మేధావి వర్గ బాధ్యులను ఆహ్వానించనున్నట్లు, అదేవిధంగా జాతీయ నేతలు పాల్గొంటారని తెలిపారు, ఈ సందర్భంగా ఏ ఐ వై ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి వలి ఉల్లా ఖాద్రీ, కె. ధర్మేంద్ర లు మాట్లాడుతూ భారతదేశంలోనే యువత ఎక్కువ ఉందని చెప్పారు. ప్రపంచంలో 186 కోట్లమంది యువజనులు ఉంటే అందులో 28 శాతం భారతీయులేనన్నారు. నవ యువకులతో నవనవలాడుతున్న యువజన దేశం భారత్ అన్నారు. ఏ దేశానికి లేనంత యువ సంపద మనకున్నప్పటికీ ఉత్తేజం, ఉత్సాహం కరువయ్యాయన్నారు. పాలకుల వినాశకర విద్యా విధానాల కారణంగా దేశంలోని 30శాతం మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అకాశాలు లేవన్నారు. రాష్ట్రానికి విభజన హామీలకు దిక్కులేదని,బయ్యారం ఉక్కు పరిశ్రమ ఊసే లేదన్నారు. ఖాజీపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన విశ్వవిద్యాలయం,సైనిక్ స్కూల్స్ వంటి హామీలను నెరవేర్చలేదన్నారు.కనీసం వీటినైనా నిర్మించి ఉంటే వేలాది మందికి ఉపాధి లభించి ఉండేదన్నారు. ప్రభుత్వాలు అవలంబిస్తున్న వినాశకర ఆర్థిక విధానాల ఫలితంగా చదువుకు తగ్గ ఉద్యోగాలు రావడం లేదని విమర్శించారు. డిగ్రీలు, పీజీలు, పీహెచ్ఎలు బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, లా కోర్సులు చదివినవారు కూడా చివరకు రైల్వే గ్యాంగ్మన్ ఉద్యోగాలకు, పోలీస్ కానిస్టేబుల్, హోంగార్డు ఉద్యోగాలకు అవకాశాలులేక వలస పోయే వారు కొందరైతే, మరికొంతమంది నిరాశ, నిస్పృహలతో కొకొయిన్, హెరాయిన్ వంటి మత్తుమందులకు బానిసలవుతున్నారన్నారు. అవినీతి, దోపిడీలకు ఆస్కారం లేని సమాజం యువత ఆకాంక్ష అని చెప్పారు. ఇది యువతతోనే సాధ్యమని, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో యువత పాల్గొనాలని పిలుపునిచ్చారు. యువజన సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని వారు యువతకు పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నెర్లకంటి శ్రీకాంత్, ఆఫీస్ బేరర్స్ వెంకటేశ్వర్లు,టి.సత్య ప్రసాద్,రామకృష్ణ, మహేందర్, శ్రీమాన్, యుగంధర్ రాష్ట్ర సమితి సభ్యులు ఎల్లంకి మహేష్, ఉపేందర్, మహేష్, శ్రీనాథ్ రెడ్డి, రవి, శ్రీనివాస్, సుధీర్,రవి కుమార్, నయీమ్ లతో కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు.