ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ డిమాండ్
తెలంగాణ వీణ,ద్వారకాతిరుమల : ఆయిల్ పామ్ రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
గురువారం ద్వారకాతిరుమల మండలం ఎం.నాగులపల్లి లో రైతు సంఘం నాయకులు పర్యటన చేసి ఆయిల్ పామ్ రైతుల సమస్యలను రైతులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కె.శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాలు వలన ఆయిల్ పామ్ రైతులు నష్టపోతున్నారని చెప్పారు. 46 శాతంగా ఉన్న దిగుమతి సుంకాన్ని కేంద్రం పూర్తిగా ఎత్తివేయడం వలన క్రూడ్ పామాయిల్ దిగుమతి అవడం వలన ఆయిల్ పామ్ గెలల ధర తగ్గిపోయి రైతులు నష్టపోతున్నా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం దారుణమని విమర్శించారు. గత ఏడాది టన్ను గెలల ధర రూ.23 వేలు ఉండగా రూ.12,400 లకు పడిపోయిందన్నారు. పెరిగిన ఉత్పత్తి ఖర్చులు రీత్యా రూ.18 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గిట్టుబాటు ధర కోసం అయిల్ పామ్ రైతులు ఆందోళనలకు సమాయత్తం కావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కట్టా భాస్కరరావు, బోయపాటి సత్యనారాయణ, తుంపాటి మురళీ, నీలప్రోలు కృష్ణ, నల్లూరి గాంధీ, టి.సుందరరావు తదితరులు పాల్గొన్నారు.