తెలంగాణ వీణ, కాప్రా : నూతనంగా నిర్మిస్తున్న చర్లపల్లి టెర్మినల్ రైల్వే పనులను పూర్తి స్థాయి నాణ్యత ప్రమాణాలతో నిర్మించాలని, ఎంఎంటీఎస్ రైల్వే సేవలను చర్లపల్లి నుండి యాదగిరిగుట్ట వరకు పొడిగించి, ప్రారంభించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి. ఎస్. బోస్ డిమాండ్ చేశారు. సీపీఐ ఉప్పల్ నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో చర్లపల్లి రైల్వే టెర్మినల్ పనులను సీపీఐ బృందం పరిశీలించడం జరిగింది.
ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి. ఎస్. బోస్ మాట్లాడుతూ ప్రజా సౌకర్యం కోసం నిర్మిస్తున్న రైల్వే టెర్మినల్ పనులు వేగంగా జరుగుతున్నప్పటికీ, నాణ్యత ప్రమాణాలు పాటించాలని సీపీఐ డిమాండ్ చేస్తుందన్నారు. టెర్మినల్ ప్రారంభం అనంతరం రోజూ వేలాది మంది ప్రజలు, ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని మరుగుదొడ్లు నిర్మించాలని, తమ పర్యటనలో ఈ సమస్యను గుర్తుంచినట్లు అన్నారు. అదేవిధంగా టెర్మినల్ లో ఎంఎంటీఎస్ రైల్వే ట్రాక్ పనులు పూర్తి చేసినప్పటికీ ,ఇప్పటికీ ఎంఎంటీఎస్ సేవలు ప్రజలకు అందుబాటులో లేదని విమర్శించారు.ఎంఎంటీఎస్ రైల్వే సేవలను చర్లపల్లి నుండి యాదగిరిగుట్ట వరకు పొడిగించాలని డిమాండ్ చేశారు. చర్లపల్లి రైల్వే ప్రధాన రోడ్డు విస్తరణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ మేడ్చల్ జిల్లా సహాయ కార్యదర్శి జీ. దామోదర్ రెడ్డి, సీపీఐ మేడ్చల్ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్. శంకర్ రావు, ఏ ఐ వై ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. ధర్మేంద్ర,ఏ ఐ వై ఎఫ్ మేడ్చల్ జిల్లా కార్యదర్శి టి. సత్య ప్రసాద్, సీపీఐ నియోజకవర్గ నేతలు ఎం. నర్సింహా, భాను కుమార్, మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.