తెలంగాణవీణ,భక్తి : సర్వే జ్ఞానోపసంపన్నా: సర్వే సముదితా గుణై:
తేషామపి మహారాజా రామ: సత్యపరాక్రమ:
మాటలతో కాకుండా చేతలతో
రామునిచే ధర్మాచరణ చేయించాడు వాల్మీకి. తన కథానాయకుడు సత్యపరాక్రమము కలిగినవాడు కావాలని కోరుకున్నాడు.
ప్రపంచములోని మరే ఇతర కవి ఈ భావాన్ని ప్రకటించలేదు. మనిషికి ఎంత పరాక్రమమున్నా అతడు సత్య ధర్మాలకు అనుగుణంగానే తన పరాక్రమాన్ని ప్రదర్శించాలి. ఎంతటి యోధుడైనా
తల్లిదండ్రుల సేవను విడిచిపెట్టకూడదు. ఇదీ వాల్మీకి సత్య హృదయము!
దేవతలకు సైతము జయించలేని గొప్ప రాజ్యo
అయోధ్యకు రాజైనా సాక్షాత్తు శ్రీమహావిష్ణు స్వరూపమని తోటివారు; ప్రజలందరూ తనను కొలుస్తున్నా ధర్మసంరక్షణలో కేవలము సాధారణ మానవుడిగానే రాముడు ప్రవర్తించాడు.
ఆత్మానo మానుషo మన్యే రామo దశరథాత్మజo
నేను సామాన్య మానవుడిని;
దశరథ మహారాజు కుమారుడిని
అని మాత్రమే అని దేవతలకే రాముడు విస్పష్టంగా చెప్పాడు.
ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలనే తత్వము వాల్మీకిది. అలాగే రాముడిని తీర్చి దిద్దాడు;
సమాజ సభ్యుడిగా సాటి మానవుడెలా మెలగాలో ఆచరించి చూపాడు. ఇది వాల్మీకి లోని
మాననీయ హృదయ కోణo!
భార్యావియోగములో ఉన్నాశరణు
వేడిన సుగ్రీవుడికీ ~ అశ్రయాన్ని కోరి వచ్చిన విభీషణుడికీ శరణాగతిని ప్రసాదించినాడు
రామచంద్రుడు. వారు వీరు అనే భేదమే లేదు రామచంద్రునికి.
అభయo సర్వ భూతేభ్యో దదామి ఏతత్ వ్రతo మమ
స్వయంగా ఆ రావణుడేవచ్చి శరణు వేడినా అతడికి సైతo అభయ ప్రధానo చేస్తాను ~ ఇది నా నియమo ~అని విస్పష్టంగా ప్రకటిస్తాడు రామయ్య.
వాల్మీకి హృదయo భూతదయకు నిలయo. లేకపోతే క్రౌంచపక్షుల దు:ఖాన్ని తానెందుకు అనుభవిస్తాడు? ఇదే తీరు రాముని పాత్రలో ప్రతిఫలించింది.
స వై రాఘవ శార్ధూల ధర్మస్త్వమభిరక్షంతు
రామా! ధర్మాన్ని కాపాడు
అని చెబుతుంది కౌసల్యామాత.
రాముడిని శార్ధూల అని సంబోధిస్తూనే తన పుత్రుని పరాక్రమమేమిటో గుర్తు చేస్తుంది.
ఎంతటి కష్టమయినా ధర్మమార్గాన్ని విడిచిపెట్టకూడదు అని బోధించింది. కారణo వాల్మీకి హృదయo సత్య ధర్మాలకు నిలయo. సీతాపహరణ విషయoలోతనకు తోడు రమ్మని మారీచుడిని అడుగుతాడు రావణాసురుడు. కానీ మారీచుడికి తెలుసు రాముడి శక్తి సామర్థ్యాలు. తాను రుచిచూచినాడు. అందుకేనేమో రామో విగ్రహవాన్ ధర్మ: సాధు:సత్యపరాక్రమ: రాజా సర్వలోకస్యదేవానామివ వాసవ:
రావణా! రాముడు మూర్తీభవించిన ధర్మ స్వరూపుడు; సత్యపరాక్రమo కలిగిలినవాడు
అని మారీచుడు రావణాసురుడికి
హితోపదేశాన్ని చేసినాడు. సత్యధర్మాలు కలిసిన పరాక్రమానికి శక్తి అపరిమితo!*అజేయo!
ఈ విషయాన్ని మారీచుడి పాత్ర ద్వారా చెప్పించినాడు వాల్మీకి
మహర్షి.