తెలంగాణ వీణ, హైదరాబాద్ : గురుకుల నోటిఫికేషన్ ఆధారితంగానే అభ్యర్థుల నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత యువజన సమాఖ్య(ఏ ఐ వై ఎఫ్),గురుకుల అభ్యర్థుల సంయుక్త ఆధ్వర్యంలో మాసాబ్ ట్యాంక్ లోని సంక్షేమ భవన్ తెలంగాణ గురుకుల నియామక బోర్డ్ ముందు ధర్నా నిర్వహించారు. గురుకుల అభ్యర్థులకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా ఏ ఐ వై ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. ధర్మేంద్ర, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నెర్లకంటి శ్రీకాంత్ లు మాట్లాడుతూ 2023సంవత్సరం లో గురుకుల బోర్డు నిర్వహించిన పరీక్షలకు హాజరైన మహిళా అభ్యర్థులను నోటిఫికేషన్ అనుసారం ఎంపిక చేయాలని నోటిఫికేషన్ జారీ చేశారని, ఆ విధానం ప్రకారమే రిక్రూట్మెంట్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. కొంతమంది నియామక బోర్డ్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే అభ్యర్థులు నష్టపోయే ప్రమాదం ఉన్నదని ఆవేదన వ్యక్తంచేశారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వం గురుకుల అభ్యర్థుల మధ్య తారతమ్య భేదాలు సృష్టించి,పరీక్షలను నిర్వహించినా ఫలితాలు వెల్లడించకుండా కాలయాపన చేసి పరోక్షంగా ఉన్నత న్యాయస్థానంకు తప్పుడు నివేదికలను సమర్పించి నియామకాలను ఆలస్యం చేసిందని ఆరోపించారు. ఆ కారణంగానే గురుకుల అభ్యర్థులకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. సత్వరమే ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అభ్యర్థుల సమస్యలపై ఉన్నత స్థాయి కమిటీని నియమించి అభ్యర్థుల సమస్యలను పరిష్కరించాలని ఏ ఐ వై ఎఫ్ రాష్ట్ర సమితి డిమాండ్ చేస్తున్నదన్నారు.లేనిపక్షంలో అభ్యర్థుల పక్షాన నిలబడి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
ధర్నా నిర్వహించిన నేపధ్యంలో నియామక బోర్డ్ అధికారులు నర్సింగ్ రావు, షౌకత్ అలీ ఖాన్ లు వివరణ ఇస్తూ నియమకాలలో జాప్యం జరిగినట్లు గుర్తించామని, అభ్యర్థులకు న్యాయం చేయడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు .ఈ కార్యక్రమంలో ఏ ఐవై ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు టి. సత్య ప్రసాద్, ఏ ఐవై ఎఫ్ హైదరాబాద్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మహమూద్….గురుకుల అభ్యర్థులు అస్మ, ప్రియాంక,జ్యోష్ణ, జ్యోతి, సుజాత,విజయ, మంగమ్మ,అమృత, కవిత, మమత లతో పాటు 50 మంది పాల్గొన్నారు.