తెలంగాణవీణ, హైదరాబాద్ : సంక్రాంతి పండుగ నేపథ్యంలో పల్లెలకు వెళ్లిన ప్రజలు మళ్లీ పట్నం బాట పట్టారు. పండుగ సెలవులు ముగియడంతో హైదరాబాద్ నగరానికి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌కు వచ్చే రహదారులపై ఉన్న టోల్‌ప్లాజాల వద్ద వాహనాల రద్దీ పెరిగింది.ముఖ్యంగా ఆంధ్రా ప్రాంతం నుండి వేల వాహనాల్లో ప్రజలు హైదరాబాద్ చేరుకుంటున్నారు. దీంతో విజయవాడ-హైదరాబాద్ రహదారిపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీ భారీగా పెరిగింది. చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద హైదరాబాద్ వైపు 10 టోల్ బూత్‌లను అధికారులు ఓపెన్ చేశారు. అదేవిధంగా కేతేపల్లి మండలం కొర్లపాడ్ టోల్ ప్లాజా వద్ద 8 బూత్‌లు ఓపెన్ చేశారు. ఫాస్టాగ్ సిస్టం ద్వారా సెకన్ల వ్యవధిలోనే వాహనాలు టోల్ గేట్ దాటుతున్నాయి. సూర్యాపేట, ఘట్ కేసర్ టోల్ ప్లాజా వద్ద ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్‌కు వచ్చే వాహనాల వల్ల భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని పోలీసులు చెబుతున్నారు. ఘట్ కేసర్ టోల్ ప్లాజా వద్ద మొత్తం 12 బూత్లకుగానూ 6 బూత్‌లను హైదరాబాద్ వైపు తెరిచారు. జనగామ, వరంగల్, నిజామాబాద్, సిద్దిపేట్, విజయవాడ, కర్నూల్, ఘట్ కేసర్ టోల్ ప్లాజా మీదుగా వాహనాలు హైదరాబాద్ చేరుకుంటున్నాయి. ట్రాఫిక్ నియంత్రణకు రాచకొండ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. అండర్ పాస్‌లు లేని చోట, క్రాసింగ్‌ల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు.