తెలంగాణవీణ ,సిరిసిల్ల : ఈ పాటలు.. ఆ మాటలు.. పల్లెతల్లి ఒడిలో లీలగా వినిపిస్తున్నాయి. పాడేది హరిదాసు. మాట్లాడేది గంగిరెద్దాయన. పట్టణాలకు చదువుల కోసం, కొలువుల కోసం వెళ్లిన వాళ్లు పల్లెకు చేరారు. కానీ మనసు విప్పి మాట్లాడుకునుడే లేదు. సెల్‌ఫోన్ చేతికొచ్చాక ప్రపంచాన్ని అరచేతిలోనే చూస్తుండ్రు. పక్కింటి వాళ్లతో మాట్లాడే సమయం లేదు. ఆనాటి ఆప్యాయతలు లేవు. అనురాగాలు కానరావు. పండగ వచ్చిందంటే నాకు ఎంతో సంబురం. ఎక్కడెక్కడో ఉండే నా వాళ్లంతా నా దరికి చేరుతారు. వాళ్లను చూస్తుంటే నా కడుపు నిండిపోతుంది. నా ఒడిలో బతికే వాళ్లకు ఒకప్పుడు చేతినిండా పని. ఇంటి నిండా ధాన్యం. ఊరు సుట్టూ వాగులు, కాలువలు. తుకాలు పోసి.. పొలాలు దున్నతూ.. నాట్లు వేస్తూ.. ఉషారుగా ఉండేవారు. బోగి మంటలు.. భోగభాగ్యాలతో కళకళలాడే పల్లెల్లో మునుపటి సందడి కనుమరుగైంది.పల్లెలకు చేరిన పట్నమోళ్లు సెల్‌ఫోన్లతోనే ఆడవట్టిరి. నాటి ముచ్చట్లు లేవు.. మంచీ చెడు అర్సుకునే ధ్యాసే లేదు. వాట్సాప్‌లలో మెస్సేజ్‌లు.. ఫేస్‌బుక్కుల్లోనే పలకరింపులు. సంక్రాంతికి చలి సంకలెత్తనిత్తలేదు. ఒకప్పుడు గండ్రపేగులు కట్టుకొని, గొంగడిబొంతలు సుట్టుకుని గజగజ వణుక్కుంట నాగండ్లు కడుదురు. మరీ ఇప్పుడు కాలం మారింది. అన్ని పనులు ట్రాక్టరే చేస్తుంది. మాగికాలం నాట్ల పనికిపోతే మంచి కూలి వస్తుంది. కానీ పైసలకు లెక్కలేదు, మనుషులకు విలువ లేదు.ఒకప్పుడు సంకురాత్రి అంటేనే గంగిరెద్దుల ఆట లు, హరిదాసుల పాటలు. ఇంటింటికీ తిరిగి ధాన్యమడుక్కుందురు.గిప్పుడు వాళ్ల తిరుగుడు లేదు.. మనం పెట్టుల్లేదు. ఒకప్పుడైతే కాలుపెట్ట సందులేకుండా ఇంటినిండ ధాన్యం ఉండేది. గొబ్బెమ్మలు చేసే పెండ నుంచి అరిసెలు చేసే బెల్లం దాకా అన్నీ కొనుడేనాయె. ఇక నవధాన్యాలు, రేగుపండ్లు.. జీడిపండ్లంటరా.. ఎన్నడో దేవునికి ముట్టినయి. కడపల మీద పిజ్జాలు.. బర్గర్లు పెట్టే కాలమొచ్చింది. సంకురాత్రి అనంగనే సకినాలు గుర్తుకొత్తయి. కుంచెడు బియ్యం నానబోసి దంచి.. తవ్వెడు నువ్వులు.. చారెడు ఓమ గలిపి సకినాలు వొత్తే నెల్లాల్ల గాసమైతుండే. గారప్పులు.. అరిసెలు.. మురుకులు.. ఎన్నెన్ని పిండివంటలో. పల్లీలు.. నువ్వులు.. బబ్బెర్లు.. పెసర్లు.. అన్ని మన పొలంల పండినయే. మరిప్పుడు చేసుడు బందాయే.. ఆన్‌లైన్ బుకింగ్‌లాయే.పొద్దు పొడిసినా పొగమంచు పోకపోతుండే. చలిమంటలు ఏసుకుని పడుసు పోరగాండ్లు, నడివయసోళ్లు.. ముసలోళ్లు కూసుందురు. ఊరు ముచ్చట్లు పెడుదురు. కోడిపుంజు కోసుకుని వాసన బియ్యంతో బిర్యానేసుకుంటే కమ్మటి వాసన. ఇప్పుడు పారంకోడి కూర రుచి లేదు.. వాసన అసలే లేదు. వానాకాలం పోయింది. సలికాలం.. ఎండ కాలమాయె. ఊరు పచ్చదనాన్ని కోల్పోయే. నా పొలిమేరలోకి సెల్‌టవర్లు వచ్చి మనుషులను దూరం చేసే. పండగన్న మాటే కానీ.. రైతు ముఖంల ఆ నవ్వేలేదు. రైతు సల్లంగుంటే సబ్బండ వర్ణాలకు పనుంటుండే. కులవృత్తి నమ్ముకున్నోళ్ల నుంచి గంగిరెద్దు, హరిదాసు వరకు అందరికీ గాసం దొరికేది. ఇప్పుడు అందరూ ఒకే చోట ఉన్నా మనసువిప్పి మాట్లాడుకునుడు లేదు. అంతా సెల్‌ఫోన్ మాయ. నా మనసులోని బాధను చెప్పిన. పండుగ పూట నా వేదన విన్నందుకు అందరికీ వందనాలు. ఇగ ఉంట బిడ్డ. బంగారు కాలంబోయింది.. బంగారమస్సోంటి మనుషులు పోయిండ్రు.. ఇంక రానురాను ఎంతగతికుం