తెలంగాణవీణ, న్యూఢిల్లీ: విమానం ఆలస్యమవుతోందన్న కోపంతో ఓ ప్రయాణికుడు సహనం కోల్పోయాడు. ఫ్లైట్ బయలుదేరడానికి మరికొంత సమయం పడుతుందని పైలట్ ప్రకటిస్తుండగా.. ఒక్కసారిగా అతనిపైకి దూసుకుపోయి భౌతికదాడికి పాల్పడ్డాడు. ఢిల్లీ నుంచి గోవాకు వెళ్లే ఇండిగో విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇండిగో ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రయాణికుడిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.వివరాల్లోకి వెళ్తే.. ఆదివారం ఉదయం ఇండిగో విమానం 6E-2175 ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గోవాకు బయలుదేరాల్సి ఉంది. కానీ దట్టమైన పొగమంచు కారణంగా దాదాపు 13 గంటలు ఆలస్యమైంది. డీజీసీఏ నిబంధనల ప్రకారం అప్పటిదాక డ్యూటీలో ఉన్న పైలట్‌లు దిగిపోయారు. కొత్త పైలట్‌లు డ్యూటీలోకి వచ్చారు. ఈ సందర్భంగా కొత్తగా డ్యూటీలోకి వచ్చిన పైలట్ ఫ్లైట్ బయలుదేరడానికి మరో గంట సమయం పడుతుందని ప్రకటిస్తుండగా.. వెనుక సీట్లో కూర్చున్న సాహిల్ కటారియా అనే ప్రయాణికుడు పరుగెత్తుకుంటూ పైలట్‌పైకి వచ్చి దాడి చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ప్రయాణికుడి తీరుపై నెటిజన్‌లు విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా, పైలట్‌పై దాడికి పాల్పడిన ప్రయాణికుడు సాహిల్ కటారియాపై ఇండిగో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఢిల్లీ పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.