తెలంగాణవీణ, హైదరాబాద్ : బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కు పనితనమే పగతనం తెలియదని మాజీ మంత్రి హరీశ్ రావు హాట్ కామెంట్స్ చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లా నర్సాపూర్ లో ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన బీఆర్‌ఎస్ కృతజ్ఞత సభలో పాల్గొన్న హరీశ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్‌ఎస్ ప్రభుత్వం పగ సాధించాలనుకుంటే సగం మంది కాంగ్రెస్ నేతలు జైళ్లలో ఉండేవారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉద్యమాలతో సాధించిన తెలంగాణలో కక్షలతో, పగలతో ఇబ్బంది పడకూడదని కేసీఆర్ పనిమీద మాత్రమే దృష్టి పెట్టారని అన్నారు. ప్రజల పక్షాన పోరాటం చేసి.. ప్రజల కోసమే పనిచేశామని తెలిపారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్‌ఎస్ కు చెందిన చాలా మందిపై జిల్లాల స్థాయిలో కేసులు పెట్టిందన్నారు. మరికొందరు మాజీ ఎమ్మెల్యేలపైనా తీవ్ర స్థాయిలో కేసులు పెట్టేందుకు తెరచాటున పక్కా స్కెచ్ వేస్తున్నారని మండిపడ్డారు. అయితే.. ఇలాంటి చర్యలకు బీఆర్‌ఎస్ నాయకులు భయపడబోరని తేల్చిచెప్పారు. రాజకీయాల్లో గెలుపు.. ఓటములు సహజమని, వాటిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్తామని హరీశ్ తెలిపారు. రాబోయే జిల్లా పరిషత్, మండల పరిషత్, పార్లమెంట్ ఎన్నికల్లో అందరం కలిసికట్టుగా పనిచేసి విజయం వైపు అడుగులు వేయాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. 2001 నుంచి ఇప్పటి వరకు ఎన్నో విజయాలు సాధించామని గుర్తు చేశారు. అలాగే అపజయాలను కూడా చూశామన్నారు. విజయాలు సాధించినప్పుడు విర్రవీగలేదని.. అపజయాలు వచ్చినప్పుడు కుంగిపోలేదని గుర్తు చేశారు. ఎంత ఎదిగితే అంత ఒదిగి పనిచేశామని వెల్లడించారు.