మహమ్మారిపై పోరాడుదాం అంటూ ప్రజలకు పిలుపు
తెలంగాణవీణ, ఏపీ బ్యూరో : వైసీపీ పాలనలో విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. స్కూళ్లలోకి గంజాయి, మద్యం, ఇతర అసాంఘిక కార్యకలాపాలు ప్రవేశించాయని ఆరోపించారు. వైసీపీ పాలనలో గుడిలోకి, బడిలోకి గంజాయి వచ్చేసిందని, కొందరు విద్యార్థులు మద్యం మత్తులో బడికి వస్తున్నారని అన్నారు. వైసీపీ సర్కారు పాపాలు స్కూలు విద్యార్థుల పాలిట శాపాలుగా మారాయని అన్నారు. గంజాయికి బానిసైన బాలుడి తల్లి సీఎం జగన్ ఇంటి ఎదుట ఆవేదన వ్యక్తం చేస్తే, పోలీసులు ఆమె నోరు మూయించారని లోకేశ్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి నివాసానికి సమీపంలోనే ఓ అమ్మాయిపై సామూహిక అత్యాచారం జరిగితే ఇప్పటివరకు నిందితుడ్ని పట్టుకోలేకపోయారని విమర్శించారు. ఆ ప్రాంతంలోనే ఓ ఉన్మాది మద్యం మత్తులో అంధురాలిని చంపేస్తే చర్యలు తీసుకోలేకపోయారని తెలిపారు. చోడవరంలో 7వ తరగతి విద్యార్థులు స్కూల్లోనే మద్యం తాగారని, దాన్ని ఓ వ్యక్తి వీడియో తీస్తే అతడిపై విద్యార్థులు దాడికి పాల్పడ్డారని లోకేశ్ వివరించారు. ప్రజలారా రండి… మహమ్మారిపై యుద్ధం చేద్దాం… మన బాలలను కాపాడుకుందాం… డ్రగ్స్ రహిత రాష్ట్రాన్ని ఆవిష్కరించుకుందాం అంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు.