- జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడు డిమాండ్
తెలంగాణ వీణ, ఏలూరు : ఎన్నికల సమయంలో జగన్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులు చేస్తున్న సమ్మె, ఆందోళన కార్యక్రమాలకు తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధికార ప్రతినిధి, ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడు తెలిపారు. ఏలూరు కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఏఐటియుసి, సిఐటియు వేరువేరుగా ఏర్పాటు చేసిన ఆందోళన శిబిరాలను శనివారం రెడ్డి అప్పలనాయుడు సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కార్మికులు చేస్తున్న సమ్మెను పోలీసులు, పోటీ కార్మికులతో విచ్ఛిన్నం చేసేందుకు ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించడం దుర్మార్గమన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేస్తానని, సమాన పనికి సమాన వేతనం ఇస్తానని హామీ ఇచ్చిన జగన్ రెడ్డి మాట తప్పి మడమ తిప్పడం ఆయన నైజాన్ని బయటపెట్టిందన్నారు. చాలీచాలని వేతనంతో పనిచేస్తున్న కార్మికులు పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో పస్తువులు ఉండే పరిస్థితి ఏర్పడిందన్నారు. హామీలు అమలు చేయాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు, మంత్రులకు అనేకసార్లు విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో కార్మికులు సమ్మెబాట పట్టాల్సి వచ్చిందన్నారు. రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను సీఎం జగన్ రెడ్డి విచ్చిన్నం చేశారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం కాంట్రాక్టు ఔర్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, రిటైర్డ్ బెనిఫిట్స్ ఇవ్వాలని, ఆప్సాస్ బానిస వ్యవస్థ నుండి కాపాడాలని రెడ్డి అప్పలనాయుడు సీఎం జగన్ రెడ్డిని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు ఒబిలిశెట్టి శ్రావణ్ కుమార్ గుప్త, అల్లు సాయి చరణ్, బొత్స మధు, బొండా రాము, ఎట్రించి ధర్మేంద్ర, రెడ్డి గౌరీ శంకర్, కందుకూరి ఈశ్వరయ్య, నూకల సాయి ప్రసాద్, బుద్ధ నాగేశ్వరావు, వల్లూరి వంశీ, వేముల బాలు, బెజవాడ నాగభూషణం, చిత్తిరి శివ తదితరులు పాల్గొన్నారు.