తెలంగాణ వీణ , చెన్నూరు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో అర్హులైన లబ్దిదారులకు 6 గ్యారంటీల పథకాలు అందజేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా అదనపు పాలనాధికారి (రెవెన్యూ) సబావత్ మోతిలాల్ తెలిపారు. శుక్రవారం చెన్నూరు నియోజకవర్గంలోని వేమనపల్లి మండలం, మల్కలపేట, చెన్నూరు పట్టణంలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు పాలనాధికారి మాట్లాడుతూ, ప్రజల సంక్షేమాభివృద్ధి కొరకు ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో 6 గ్యారంటీల పథకాలను అర్హులైన ప్రతి లబ్దిదారుడికి అందేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలలో నిర్వహిస్తున్న ప్రజాపాలన కార్యక్రమాన్ని అర్హులైన లబ్దిదారులు సద్వినియోగం చేసుకోవాలని, సంబంధిత అధికారుల ద్వారా దరఖాస్తు ఫారాలు అందించడం జరుగుతుందని, దరఖాస్తుదారులు ముందస్తుగానే తమ దరఖాస్తును నింపి వార్డు, గ్రామ సభ వద్దకు రావాలని, దరఖాస్తుదారులు నిజమైన సమాచారాన్ని ఫారములో పొందుపర్చాలని, అర్హత గల లబ్దిదారులకు న్యాయం జరుగుతుందని తెలిపారు. జనవరి 6, 2024 వరకు (ప్రభుత్వ సెలవులు మినహాయించి) ప్రతి రోజు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకాలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలోని 311 గ్రామపంచాయతీలు, 7 పురపాలక సంఘాలలో దరఖాస్తుల స్వీకరణ కొరకు 1 వేయి 702 కౌంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలోని మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాలలో ప్రజాపాలన కార్యక్రమం నిర్వహణ కొరకు ప్రత్యేక అధికారులను నియమించడం జరిగిందని, దరఖాస్తుల స్వీకరణలో స్త్రీ, పురుషులకు వేర్వేగా క్యూ లైన్లు, మహిళల కొరకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రజల సౌకర్యార్థం హెల్ప్ డెస్క్ కౌంటర్లు, త్రాగునీరు, టెంట్లు, కౌంటర్ల కొరకు టేబుళ్ళు, క్యూ లైన్ల కొరకు బారీకేడ్లు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. దరఖాస్తు ఫారముతో పాటు ఆధార్ కార్డు, తెల్లరేషన్ కార్డు జతపరచాలని, దరఖాస్తుదారునికి తప్పనిసరిగా రశీదు అందించడం జరుగుతుందని, స్వీకరించిన దరఖాస్తును ఆన్లైన్లో నమోదు చేసి ప్రతి దరఖాస్తుకు ఒక ప్రత్యేక సంఖ్యను కేటాయించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.