- ఉత్తర ద్వారంలో భద్రాద్రి రామయ్య భక్తులకు దర్శనం
- వైకుంఠ రాముడిగా భక్తులకు అనుగ్రహం
- తిలకించి తరించిన భక్తజనం
- ఉత్సవాలు విజయవంతం పట్ల హర్షం
తెలంగాణ వీణ , భద్రాద్రి కొత్తగూడెం : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో శనివారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా రామయ్య ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు జై శ్రీరామ్..జై జై.. శ్రీరామ్ అంటూ జయ జయధ్వానాలు చేశారు. వేదపండితులు ముక్కోటి విశిష్టతను వివరించారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వీవీఐపీ, వీఐపీ సెక్టార్ లతో పాటు ఇతర సెక్టార్లలోని భక్తులు వేడుకను తిలకించారు. స్థానాచార్యులు భక్తులకు ముక్కోటి ఏకాదశి విశిష్టతను వివరించారు. అర్చకులు 108 ఒత్తులతో వెలిగించిన హారతినికి భక్తులు అందుకున్నారు. ఉత్తర ద్వారం దర్శనం తర్వాత ఉత్సవ మూర్తులను మాడ వీధుల్లో ఊరేగించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల అన్ని ఏర్పాట్లు చేశారు. ఎప్పటికప్పుడు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ప్రతి సెక్టార్ లో ఏర్పాట్లు పర్యవేక్షణ కు జిల్లా అధికారులను, లైజన్ అధికారులను నియమించారు. బందోబస్తు ఏర్పాట్లును ఎస్పీ డాక్టర్ వినీత్ పర్యవేక్షించారు. వేడుకలకు ఉప ముఖ్యమంత్రి సతీమణి మల్లు నందిని బట్టి విక్రమార్క, భద్రాచలం, పినపాక, ఇల్లందు, అశ్వారావుపేట శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్ రావు, పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, జారే ఆదినారాయణ, ఖమ్మం కలెక్టర్ విపి గౌతం దంపతులు, ఐటిడిఎ పిఓ ప్రతీక్ జైమ్ దంపతులు, అదనపు కలెక్టర్లు డాక్టర్ రాంబాబు, మధుసూదన్ రాజు, ఎఎస్పీ పంకజ్ పరితోష్, దేవస్థానం ఈఓ రమాదేవి తదితరులు హాజరయ్యారు.
శ్రీమహావిష్ణువు అలంకారంలో…
గరుడ వాహనరూపుడైన రామచంద్రుడు భక్తులకు శ్రీమహావిష్ణువు అలంకారంలో దర్శనమిచ్చారు. అర్చ కులు స్వామివారికి విశేష ఆరాధన, శ్రీరామ పదాక్షరీ మంత్ర సంపుటిత అష్టోత్తర శతనామార్చన, చతుర్వే చాలు, గరుడ ప్రబంధాలు, ఇతిహాసాలు, శరణాగతి గజ్జగరుడ దండం, భక్తరామదాసు రచించిన దాశరథి శతకాన్ని పఠించారు. వైకుంఠ రాముడికి అష్టోత్తర శత హారతినిచ్చారు. భక్తరామదాసు కాలం నుంచి వస్తున్న సంప్రదాయం ప్రకారం భద్రాచలం తహసీల్దార్ శ్రీని వాస్ మూలవరులకు స్నపనం నిర్వహించారు.
గరుడ వాహనంపై శ్రీరామచంద్రమూర్తులు..
ఉత్తర ద్వారంలో భక్తులకు దర్శనమిచ్చిన అనంతరం వైకుంఠరాముడు తిరువీధి సేవకు తరలివెళ్లారు. చలువ చప్పర వాహనంపై పెరియాళ్వార్, నమ్మాళ్వార్, మరో వాహనంపై అందా కమ్మ వారు, హనుమత్ వాహనంపై లక్ష్మణస్వామి, గజవాహనంపై సీతమ్మ వారు, గరుడ వాహనంపై శ్రీరామచంద్రమూర్తుల తిరువీధి సేవ సాగింది. మేళతాళాలు, భాజా భజంత్రీలు, వేదమం త్రోచ్చారణ మధ్య శోభాయమానంగా సాగింది. రాపత్తు ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు విజయవంతం..
వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు విజయవంతం అయినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల తెలిపారు. అన్ని శాఖల అధికారులు సిబ్బంది సమన్వయంతో సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించిన స్వామి వారి తెప్పోత్సవం, ఉత్తర ద్వార దర్శనం విజయవంత కావడం పట్ల భక్తులు ప్రజలు ప్రజా ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల తెలిపారు. సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా నిర్వహించామని చెప్పారు. ఈ సందర్భంగా ఉత్సవాలు నిర్వహణలో జిల్లా యంత్రాంగానికి సహకరించిన భక్తులకు పాత్రికేయులకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు కలెక్టర్ డాక్టర్ ప్రియాంక పేర్కొన్నారు.