తెలంగాణ వీణ , హైదరాబాద్ : బిగ్ బాస్ సీజన్-7 విజేత పల్లవి ప్రశాంత్ టైటిల్ గెలిచాడన్న మాటే కానీ వివాదాలతో సరిపోతోంది. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ముగిశాక జరిగిన గొడవల నేపథ్యంలో అతడిపైనా కేసు నమోదైంది. దాంతో, పల్లవి ప్రశాంత్ పరారీలో ఉన్నాడని, అతడి ఫోన్ స్విచాఫ్ చేసి ఉందని అతడి కోసం జూబ్లీహిల్స్ పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారని ఈ ఉదయం నుంచి మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో, పల్లవి ప్రశాంత్ ఓ వీడియో విడుదల చేశాడు. తాను ఎక్కడికీ పారిపోలేదని, తాను ఇంట్లోనే ఉన్నానని వెల్లడించాడు. తన గురించి మీడియాలో వస్తున్నదంతా తప్పుడు సమాచారం అని పల్లవి ప్రశాంత్ స్పష్టం చేశాడు. తాను ఏ తప్పు చేయలేదని, ఇతరులు చేసినవి తనపై వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. తనను అప్రదిష్ఠ పాల్జేసేందుకే ఇలాంటివన్నీ ప్రచారం చేస్తున్నారని ఆరోపించాడు.