తెలంగాణ వీణ , సినిమా : తికమకతాండ అనే గ్రామంలోని ప్రజలందరికి మతిమరుపు అనే సమస్య ఉంటుంది. రచ్చబండతో సహా ప్రతి ఏరియాను గుర్తుపెట్టుకోవాడానికి పలకపై పేర్లను రాసి అక్కడ తగిలిస్తారు. మతిమరుపు కారణంగా అనేక సమస్యలు వస్తాయి. దీంతో తమకున్న మతిమరుపు సమస్యను తొలగించుకోవడం కోసం అమ్మవారి జాతర చేద్దాం అనుకుంటారు. అంతా జాతరకు సిద్ధమైన సమయంలో అమ్మవారి విగ్రహం మాయమైపోతుంది. అసలు అమ్మవారి విగ్రహం ఎలా మాయమైంది? ఆ ఊరి జనాలకు మతిమరుపు సమస్య ఎలా వచ్చింది? ఆ ఊరి సమస్యను తీర్చడానికి రంగంలోకి దిగిన హీరోలకు ఎదురైన సమస్యలు ఏంటి? విగ్రహాన్ని తిరిగి తీసుకురావడానికి వాళ్లు పడిన కష్టమేంటి? చివరకు ఏం జరిగింది అనేది తెలియాలంటే థియేటర్స్‌లో తిమకతాండ సినిమా చూడాల్సిందే. ఊరందరికీ మతిమరుపు అనే ఒక కొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కిన సినిమా ఇది. ఆ ఊరికి ఒక అమ్మవారు ఉండడం .. అమ్మవారి విగ్రహం మాయమవడం తిరిగి ఊరు వారు ఆ విగ్రహాన్ని పట్టుకున్నారా లేదా అనేదే ఆ మూవీ కథాంశం. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ కొత్తగా ఉన్నప్పటికీ..తెరపై అంతే కొత్తగా చూపించడంలో కొంతవరకు మాత్రమే సఫలం అయ్యాడు.ఫస్టాఫ్ అంతా ఊరి వాళ్ళ మతిమరుపుతో కాస్త కామెడీ, హీరోల ప్రేమ కథలతో సాగుతుంది. యాదమ్మ రాజు కామెడీ నవ్వులు పూయిస్తుంది. విగ్రహం మాయమవ్వడంతో అసలు కథ మొదలవుతుంది. విగ్రహం తీసుకురావడానికి హీరో రంగంలోకి దిగడంతో కథ మరింత ఆసక్తికరంగా మారుతుంది. ఇంటర్వెల్ సీన్ ద్వితియార్థంపై ఆసక్తిని పెంచుతుంది. సెకండాఫ్‌లో కథనం సీరియస్‌గా సాగుతుంది. కొన్ని సాగదీత సీన్స్ ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ..క్లైమాక్స్ మాత్రం ఆకట్టుకుంటుంది. లాజిక్స్‌ని పక్కకి పెట్టి చూస్తే గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ లవ్ కామెడీ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ ఆకట్టుకుంటుంది