- రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
తెలంగాణ వీణ, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం వద్ద అదనపు వంతెన నిర్మాణ పనులను ఫిబ్రవరి నెలాఖరు వరకు పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర రావు జాతీయ రహదారుల ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఆదివారం భద్రాచలం వద్ద వంతెన నిర్మాణ పనులను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనుల్లో తీవ్ర జాప్యం జరిగిందని వేగవంతం చేయాలని చెప్పారు. బ్రిడ్జి నిర్మాణానికి తాను 2015లో శంకుస్థాపన చేస్తే నేటి వరకు పనులను సాగదీస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేస్తూ తక్షణం పనులు ప్రారంభించాలని చెప్పారు. వంతెనకు ఇరువైపులా అప్రోచ్ రహదారి పనులను తక్షణమే ప్రారంభించాలని చెప్పారు. దేవస్థానానికి దేశ, విదేశాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారని భద్రాచలం పట్టణాన్ని సుందర పట్టణంగా తీర్చిదిద్దేందుకు మోడల్ డివైడర్లు, ఫుట్ పాత్ లు ఏర్పాటు చేయాలని సూచించారు. అందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. భద్రాచలం నుండి జగదల్పూర్ వరకు రహదారి పరిస్థితులను సంబంధిత అధికారులు అడిగి తెలుసుకున్నారు. ముసలిమడుగు వద్ద వంతెన వెడల్పు పనులను తక్షణమే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. అప్రోచ్ రోడ్ నిర్మాణానికి మట్టి దొరకడం లేదని సైట్ ఇంజనీర్ చెప్పిన సమాధానంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. మట్టిని సమకూర్చుకోవాలని చంద్రమండలం నుంచి తీసుకొస్తారా అంటూ ప్రశ్నించారు. పనుల జాప్యంపై మూడుసార్లు తొలగించినప్పటికీ మీలో మార్పు రాలేదని చెప్పారు. పనులను జాప్యం చేయడం తగదని చెప్పారు. 2015లో తాను, గడ్కరీ శంకుస్థాపన చేశామని అప్పటి నుండి ఇప్పటి వరకు పనులు జరుగుతునే ఉన్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. పనులు చేయాల్సిన సమయం ఆసన్నమైందని ఇంకా జాప్యం చేయక యుద్ధ ప్రాతిపదికన చేపట్టి పూర్తి చేయాలని చెప్పారు. 90 కోట్ల మంజూరు చేశామని వాటిలో 65 కోట్లు విడుదల కాగా 58 కోట్ల పనులు పూర్తి చేశామని ఇంకనూ 7 కోట్ల పనులు పెండింగ్ లో ఉన్నాయని సైట్ ఇంజనీర్ తెలిపారు. వంతెనతో పాటు రెండు వైపులా అప్రోచ్ రహదారి పనులు చేపట్టాలని చెప్పారు. పిలర్స్ పూర్తి అయ్యాయి కాబట్టి ఇంకా పనుల్లో జాప్యం చేయొద్దని చెప్పారు. సంబంధిత అధికారులు, ఏజన్సీలు సమగ్ర నివేధికలతో కలెక్టర్ కార్యాలయానికి రావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఎస్పీ డాక్టర్ వినీత్, అదనపు కలెక్టర్ డాక్టర్ రాంబాబు,
ఎన్ హెచ్ ఈ ఈ యుగంధర్, ఆర్ అండ్ బి ఈ ఈ వెంకటేశ్వర్లు, ఇరిగేషన్ ఈ ఈ రాం ప్రసాద్, ఆర్డిఓ మంగి లాల్, ఎన్ హెచ్
డిఈ శైలజ తదితరులు పాల్గొన్నారు.