తెలంగాణ వీణ , హైదరాబాద్ : మహిళల్లో రుతుక్రమం వైకల్యం కాదని, వేతనంతో కూడిన సెలవు అక్కర్లేదంటూ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ రాజ్యసభలో వ్యాఖ్యానించడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. స్వయంగా కేంద్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రే రాజ్యసభ సాక్షిగా రుతుక్రమ పోరాటాలను కొట్టిపారేయడం నిరుత్సాహం కలిగించిందని అన్నారు. స్మృతి ఇరానీ వ్యాఖ్యలు అజ్ఞానంతో కూడినవని, ఒక మహిళగా భయంకరంగా అనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రుతుక్రమంపై మహిళల పోరాటాలు, ప్రయాణాలకు ఓదార్పు దక్కలేదన్నారు. రుతుక్రమంపై మహిళల పోరాటాలు సముచితమైనవని, దీనిపై చర్చ అక్కర్లేదని ఎంఎల్సీ కవిత అన్నారు.
రుతుక్రమం ఒక చాయిస్ కాదని, జీవ వాస్తవికమని గుర్తించాలని సూచించారు. వేతనంతో కూడిన సెలవు అక్కర్లేదని తిరస్కరించడమంటే అసంఖ్యాకమైన స్త్రీలు అనుభవించే నిజమైన బాధను విస్మరించినట్టేనని వ్యాఖ్యానించారు. మహిళలు ఎదుర్కొంటూ పోరాటం చేస్తున్న వాస్తవికమైన సవాళ్ల పట్ల సానుభూతి చూపకపోవడం ఒక మహిళగా విస్తుగొల్పుతోందని మండిపడ్డారు.