ఉన్నతాధికారులతో సమీక్షించిన సీఎస్ శాంతికుమారి
తెలంగాణ వీణ , హైదరాబాద్: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈనెల 18 నుంచి 23వ తేదీ వరకు శీతాకాల విడిదికి కోసం హైదరాబాద్ వస్తున్న నేపథ్యంలో ఘనంగా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి బుధవారం ఉన్నతాధికారులను ఆదేశించారు. రాష్ట్రపతికి ఘనస్వాగతం పలకడంతోపాటు, శాఖల మధ్య సమన్వయంతో వ్యవహరించాలని, ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని ఆమె స్పష్టం చేశారు. సచివాలయంలో ఆమె డీజీపీ రవిగుప్తా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్‌శర్మ, సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి శేషాద్రి, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి, సీనియర్ పోలీసు ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్రపతి విడిది చేసే బొల్లారంలోని రాష్ట్రపతి భవన్ వద్ద పటిష్టమైన భారీ బందోబస్తుతో పాటు, ట్రాఫిక్ సమస్యలేవీ రాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. వీవీఐపీల భద్రతకు ఉపయోగించే బ్లూబుక్ ఆధారంగా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సూచించారు.